SL vs NZ : భారత జట్టును వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్ (Newzealand) జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీమిండియాపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించి సిరీస్ పట్టేసిన కివీస్ జైత్రయాత్రకు తెరపడింది. మళ్లీ శ్రీలంక (Srilanka) చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. శనివారం జరిగిన తొలి టీ20లో లంక స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో అదరగొట్టిన చరిత అసలంక బృందం సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వారం రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ ఆట మారింది. భారత గడ్డపై 12 ఏండ్ల రికార్డును బ్రేక్ చేస్తూ టెస్టు సిరీస్ గెలుపొందిన ఆ జట్టు పొట్టి పోరులో తడబడింది. దంబుల్లా స్టేడియంలో శ్రీలంక స్పిన్నర్లకు తలొగ్గింది. దునిత్ వెల్లలాగే(3/20) వనిందు హసరంగ(2/20)లు తిప్పేయగా కివీస్ 135 పరుగులకే ఆలౌటయ్యింది. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రాస్‌వెల్(27), జాకరీ ఫల్కీస్(27)లు మాత్రమే పర్వాలేదనిపించారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
Sri Lanka’s spinners claimed six wickets between them and then it was the cool head of Charith Asalanka in the chasehttps://t.co/byw7L55DBC
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2024
ఓపెనర్లు పథుమ్ నిశాంక(19), కుశాల్ మెండిస్(0)లు విఫలైమనా కుశాల్ పెరీరా(23), కుశాల్ మెండిస్(23)లు దంచారు. కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును ఉరికించారు. వీళ్లు ఔటయ్యాక కెప్టెన్ చరిత అసలంక(35 నాటౌట్), వనిందు హసరంగ(22)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయం వైపు నడిపించారు. హసరంగ తర్వాత దునిత్ వెల్లలాగే(11 నాటౌట్) సాయంతో అసలంక జట్టును గెలిపించాడు.