ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 23, 2021 , 00:04:15

సిద్దిపేటను దేశంలో అగ్రస్థానంలో నిలపాలి

సిద్దిపేటను దేశంలో అగ్రస్థానంలో నిలపాలి

 సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 22 : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట మున్సిపాలిటీని దేశంలో అగ్రస్థానంలో నిలపాలి, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలి, ఇందుకోసం స్వచ్ఛ సర్వేక్షణ్‌ యాప్‌ ద్వారా ప్రజలంతా ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్‌లోని 14, 28వ వార్డుల్లో ఎమ్మెల్సీ పారూఖ్‌ హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తో కలిసి సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యర్థం అంటే అర్థం వచ్చేలా సిద్దిపేట మున్సిపాలిటీ ఆలోచన చేస్తున్నదని, తడి చెత్త నుంచి గ్యాస్‌ను, పొడి చెత్తలోని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకలను తయారు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే గల్లీని, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. యూజీడీతో మోరీలు ఎండిపోతున్నా యి, కేవలం వర్షపు నీరు మాత్రమే ఉండే పరిస్థితి వచ్చిందన్నారు. యూజీడీతో రోడ్లు తవ్వడం జరిగిందని, కొంత ఆలస్యమైనా పదేండ్ల పాటు ఉండేలా రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. సీతారాంనగర్‌, లెక్చరర్‌ కాలనీల్లో 10 రోజుల్లో రూ.20లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే వరంగల్‌-సిద్దిపేట-మెదక్‌ రోడ్డును జాతీయ రహదారి చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను వేరు చేసి మున్సిపల్‌ వాహనాలకు అందిం చి స్వచ్ఛ సిద్దిపేటకు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌ కంటే తక్కువ ధరకు స్టీల్‌ బ్యాంక్‌లను పెట్టామని, వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టామని, సీఎం కేసీఆర్‌ మరో 1000 ఇండ్లు మంజారు చేశారని, ఏడాదిలో ఇండ్లను పూర్తిచేసి అర్హులకు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పట్టణ ప్రజలు స్వచ్ఛతా యాప్‌లోకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొని  సిద్దిపేట పేరు ఇనుమడింప చేయాలన్నారు. ఇందుకు Swachhsurvekshan2021.org/citizen Feed back %2c లేదా 1969 డయాల్‌ చేసి ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కంటెం లక్ష్మీరాజు, శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి పాల్గొన్నారు. 

అసిస్టెంట్‌ డీఈ స్టోర్స్‌ కార్యాలయం ప్రారంభం...

జిల్లా విద్యుత్‌ కార్యాలయ ఆవరణలో రూ.39.20 లక్షల వ్యయంతో నిర్మించిన అసిస్టెంట్‌ డీఈ స్టోర్స్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ పారుఖ్‌హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి వెంట ఎస్‌ఈ కరుణాకర్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

 పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి భూమిపూజ...

పట్టణంలోని 10వ వార్డులో పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ మేరకు ఆలయానికి వచ్చేలా రహదారి నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బండారి నర్సింహులు, ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి వై.ధర్మ, బాలయ్య, హనుమాన్‌ నగర్‌ ముదిరాజ్‌ సంఘం గౌరవ అధ్యక్షుడు జెట్టి తిరుపతి, అధ్యక్షుడు జెట్టి రాజేశం, విక్టరీ కేఫ్‌ చిన్న, యాట యాదగిరి, గొడుగు సత్తయ్య, రాజేశం, శ్రీనివాస్‌, గిరీశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo