మెదక్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ‘జీవితాంతం ప్రజా సేవలో ఉంటా.. మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ట్రస్టు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తా’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్, బట్టి జగపతితో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రెండు సెట్ల నామినేషన్ వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, ఇంటింటికీ బాండ్ పేపర్ ఇచ్చి అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రజలను దగా చేసి మోసం చేసి దొంగఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ అసలు రంగు బయటకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ రైతులను దుఃఖసాగరంలో నింపిందన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాక ప్రజలను మోసం చేశాడన్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని చెప్పారు. దుబ్బాక ప్రజలకు నాగలి, ఎద్దులు, నిరుద్యోగులకు రెండువేలు ఇస్తానని మోసం చేశాడన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్‌రావును 54వేల ఓట్లతో అకడి ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా చెల్లుతుందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చానని,ప్రధాన పార్టీ అభ్యర్థులు, వారి అర్హతలను చూసి ఓటు వేయాలని కోరారు.
నిరుపేద కుటుంబాల కోసం సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేస్తున్నానని, గెలిచిన తొమ్మిది నెలల్లోపు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్‌హాల్ నిర్మించి ప్రతి పేద కుటుంబానికి ఒక రూపాయితో శుభకార్యాలయాలు చేసుకునే సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణతో ఘనవిజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. 11 ఏండ్లు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పనిచేసిన అపార అనుభవం ఉందన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు ఉన్నారు, వారి గుణగణాలు ఏమిటో చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్‌రావు, పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అశేష జనవాహినితో రెండు సెట్ల నామినేషన్లు వేయనున్నట్లు ఆయన తెలిపారు.