మెదక్, (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్: ఏప్రిల్ 24: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఆరో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్‌కుమార్ షెట్కార్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి దేవ సిఖామణి, రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ నుంచి ఎండీ మున్వర్ హుస్సేన్, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజు బట్టెంకి, స్వతంత్ర అభ్యర్థులు తలారి అశోక్, జైపాల్ నాయక్ జడావత్, రమేశ్ సజ్జాపూర్, ఎండీ యాకూబ్ షరీఫ్, గొల్లపల్లి మాణయ్య ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.ఆయా నామినేషన్లను రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి స్వీకరించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వివరాలను ఎప్పటికపుడు సంగారెడ్డి రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచడంతో పాటు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామ న్నారు. పూర్తి వివరాల కోసం affidavit. eci.gov.in ప్రత్యేక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియకు తెరపడనున్నది.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల 2024 నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్తో కలిసి అందజేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు హన్మంతరావు, మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌తో కలిసి రెండోసెట్ నామినేషన్ వేయగా, విముక్తి చిరుతల కక్షి పార్టీ నుంచి ఎల్లయ్య, యుగ తులసి పార్టీ నుంచి అనిల్మొగిలి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా లక్ష్మీనారాయణ, నవీన్, రమేశ్, జి.ప్రదీప్‌కుమార్, ఆంజనేయులు, ధర్మారం నరహరి, దాసరి భానుచందర్ నామినేషన్లు వేశారు.