Artificial Intelligence | ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు’ అన్నది పాత సామెత. ఇప్పుడు ఏ కార్యాన్నయినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న ఘనతను కృత్రిమ మేధ సొంతం చేసుకుంది. భగవంతుడి సృష్టిలో మనిషి గొప్పవాడు అయితే, మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మహోన్నతమైనదిగా నిలుస్తున్నది. మనిషి మనుగడను సులభతరం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నది. అయితే, సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా.. కృత్రిమ మేధ ప్రకృతికి విరుద్ధంగా మానవుడికి సవాలు విసురుతున్నది.
కంప్యూటర్ యుగాన్ని పూర్తిగా శాసిస్తున్న మనిషి మస్తిష్కంలోంచి ఆవిర్భవించిన అద్భుతమైన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జటిలమైన సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఆవిష్కరించిన కృత్రిమ మేధ మనిషి అంచనాలకు మించి పనితనం కనబరుస్తున్నది. ఫోన్లో పంపే సందేశం మొదలుకుని రోదసిలోకి పంపే రాకెట్ వరకు ప్రతిచోటా ఏఐ ముద్ర కనిపిస్తున్నది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌తో పుట్టుకొచ్చిన ఏఐ ఇప్పుడు కోడింగ్ రాసేస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు జేజమ్మయి కూర్చుంది. మరమనిషిలోకి చొరబడి మనలోకి వచ్చేసింది. అవసరాలను చక్కబెడుతున్నది. అయితే దర్శకుడు శంకర్ సృష్టి ‘చిట్టి రోబో’లా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు విరుచుకుపడుతుందోనన్న ఆందోళన మాత్రం మానవాళిని కంగారు పెడుతూనే ఉంది.
☞ సాంకేతిక విప్లవంగా చెప్పే కృత్రిమ మేధ వస్తు ఉత్పాదక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. సంక్లిష్టతతో కూడిన సమస్యలకు తేలిక పరిష్కారాలు చూపడంలోనూ ఇది ముందుంది.
☞ సమాచార సేకరణలో ఏఐ అల్గారిథమ్స్ మెరుపు వేగంతో పనిచేస్తాయి. గూగుల్ వంటి సెర్చింజన్లు లిప్తపాటులో కొండంత సమాచారాన్ని అందించడానికి కారణం ఏఐ సాంకేతికతే!
☞ కంప్యూటర్‌తో ముడిపడి ఉన్న అన్ని సేవల్లోనూ ఇప్పుడు ఏఐ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నది. వేగంతోపాటు కచ్చితత్వం దీని ప్రత్యేకత. డెసిషన్ మేకింగ్‌లోనూ వినియోగదారులకు సాయపడుతున్నది.
☞ వైద్యరంగంలో ఏఐ టెక్నాలజీ అపర ధన్వంతరిగా సేవలు అందిస్తున్నది. సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం చాకచక్యంగా నిర్వహిస్తూ ‘ఔరా!’ అనిపించుకుంటున్నది. రేడియేషన్, కీమో థెరపీ వంటి విధానాల్లోనూ శరీరంలోని వేరే భాగాలకు హాని కలగకుండా నిర్వహిస్తూ మానవాళికి మేలు చేస్తున్నది.
☞ ప్రకృతి విపత్తుల అంచనాలో ఏఐ గొప్ప పనితనం కనబరుస్తున్నది. ఉపగ్రహాలు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి కచ్చితత్వంతో కూడిన ఫలితాలను రాబడుతున్నది. పర్యావరణ మార్పుల గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నది. సముద్ర భూకంపాలు, సునామీ హెచ్చరికలు జారీ చేయడంలో సహాయకారిగా ఉంటున్నది. అంతరిక్ష పరిశోధనల్లోనూ శాస్త్రవేత్తలకు సహాయకారిగా నిలుస్తున్నది.
ఏఐ ఆగడాలకు కళ్లెం వేయడానికి యురోపియన్ యూనియన్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్’ ప్రతిపాదించింది. సమాచార గోప్యత, పొరపాట్లకు తావులేకుండా, పారదర్శకత పాటించేలా కృత్రిమ మేధను ఉపయోగించేందుకు చట్టం చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. కెనడా ప్రజల భద్రత కోరి ‘నేషనల్ ఏఐ స్ట్రాటజీ’ పేరుతో కృత్రిమ మేధ వినియోగంపై నియమావళి అమలుచేస్తున్నది అక్కడి ప్రభుత్వం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం కెనడా బాటలోనే ఏఐ దుష్ప్రభావాలపై విలువల కమిటీని ఏర్పాటుచేసింది.
మానవజాతి మానస పుత్రికగా ఉద్భవించిన కృత్రిమ మేధ కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. అల్గారిథమ్స్‌ను అధిగమించి మనిషి నమ్మకాన్ని వమ్ము చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది.
☞ ఏఐ వ్యవస్థ బలోపేతం అవుతున్న కొద్దీ మానవాళికి కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పది మంది చేసే పని.. కృత్రిమ మేధ మద్దతుతో ఒకరే చేసే పరిస్థితులు ఏర్పడటంతో వారి ఉపాధి అవకాశాలకు గండి పడుతున్నది. సాఫ్ట్వేర్ రంగంలో మాత్రమే కాదు, యంత్రాలకుతోడు ఏఐ వచ్చి చేరడంతో భారీ పరిశ్రమల్లోనూ కార్మికులు తొలగింపునకు గురవుతున్నారు.
☞ అల్గారిథమ్స్ ఆధారంగా డేటాను విశ్లేషించడం వల్ల నాణేనికి ఒకవైపు మాత్రమే చూపుతుంది. విభిన్న కోణాల్లో సమాచారాన్ని అందివ్వడంలో విఫలమవుతున్నది.
☞ ఏఐ అల్గారిథమ్స్ కఠినంగా ఉండటం వల్ల వాటిని అర్థం చేసుకోవడం కష్టమే! అయితే వాటిని ఉపయోగిస్తున్న వ్యక్తి తన విచక్షణకు అనుగుణంగా పనిచేసేందుకు వీలు లేకుండా పోతున్నది.
☞ ఏఐ టెక్నాలజీ క్షణాల వ్యవధిలో వ్యక్తిగత సమాచారమంతా రాబట్టుకోగలదు. దానిని ఎవరైనా దుర్వినియోగం చేసే వీలుంది. సమాచార గోప్యత విషయంలో కృత్రిమ మేధను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్కామర్లు ఏఐ సాంకేతికతను వాడుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నది. బ్యాంకు రుణం సెర్చ్ చేసింది మొదలు ఆ వ్యక్తి సమాచారం ఏఐ ద్వారా రాబట్టుకొని, రుణం ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సెర్చింజన్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికితే.. ఆ వ్యక్తికి కుదురులేకుండా చేస్తున్నారు. కోట్లాది మంది వ్యక్తిగత వివరాలను, ఫోన్ నంబర్లు కార్పొరేట్ కంపెనీలకు, ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?