Telegram app | షార్ట్ మెసేజింగ్ సర్వీస్ యాప్‌గా టెలిగ్రామ్ అందరికీ సుపరిచితమే! సందేశాలతోపాటు వీడియోలు, మీడియా ఫైల్స్ యథేచ్ఛగా ఇందులో పంపుకోవచ్చు. ఒకేసారి వెయ్యిమందికి గ్రూప్ వీడియోకాల్ చేయొచ్చు. వీటితోపాటు ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతున్న నయా ఫీచర్లు టెలిగ్రామ్ మీద కిలోగ్రాముల కొద్దీ అభిమానాన్ని పెంచేశాయి. పండ్లున్న చెట్టుకే రాళ్లు అన్నట్టు.. కొత్త ఫీచర్లతో యూజర్లను కట్టిపడేస్తున్న మెసేజింగ్ యాప్ మీద స్కామర్స్ తరచూ పంజా విసురుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. మీ టెలిగ్రామ్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకొని ఉండటం మంచిది.
మెసేజింగ్ సర్వీస్‌లో టెలిగ్రామ్ ప్రత్యేకమైనది అని అందరికీ తెలుసు. ఈ తరం కోరుకునే మెగా ఫీచర్లు ఇందులో ఎన్నో కనిపిస్తాయి. గ్రూప్‌లో రెండు లక్షల మంది సభ్యుల వరకు యాడ్ చేసుకునే వెసులుబాటు ఉండటం విశేషం. సీక్రెట్ చాట్స్, సెల్ఫ్-డిస్ట్రక్టింగ్ మెసేజెస్ వంటి ఫీచర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇందులోని బోట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్‌తో కావాల్సిన అంశాలపై బోట్ క్రియేట్ చేసి స్పెషల్ చాట్‌కు తెరతీయొచ్చు. అంతేకాదు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ కావడం, 2జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా పంపే అవకాశం ఉండటంతో టెలిగ్రామ్ చాలామందికి చేరువైంది.
టెలిగ్రామ్‌లోని కొన్ని ఫీచర్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు స్కామర్లు. గోప్యతను ఆసరాగా చేసుకొని ఈ మెసేజింగ్ యాప్ వేదికగా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ వినియోగదారులు లక్ష్యంగా జరిగే రకాల స్కామ్‌లు..
ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్: ముందుగా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఏర్పాటుచేస్తారు. అందులో రకరకాల ఆఫర్లు ఉన్నట్టు పేర్కొంటారు. అధిక వడ్డీ ఆశ చూపించి గ్రూప్ సభ్యులను బోల్తా కొట్టిస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట ఎంతోకొంత వసూలు చేస్తారు. చివరికి ఎరకు చిక్కిన వారినుంచి భారీగా దండుకుంటారు.
ఫిషింగ్ స్కామ్స్: గ్రూప్ క్రియేట్ చేసి లింక్‌లు, సందేశాలు పంపిస్తారు. వ్యక్తిగత సమచారం, పాస్వర్డ్, ఆర్థిక వివరాలు సేకరించి వాటి ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడతారు.
ఫేక్ గివ్ అవేస్: స్కామర్లు ఫేక్ గ్రూప్ క్రియేట్ చేసి.. క్రిప్టో కరెన్సీ ఆఫర్ చేస్తుంటారు. లింక్ ఓపెన్ చేసిన వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు.
రొమాన్స్ స్కామ్స్: ఫేక్ ప్రొఫైల్స్‌తో ముగ్గులోకి దించుతారు కొందరు. వాళ్ల ఫొటోలు, చాట్ నిజమని నమ్మి మాయలో పడిపోతారు. నిండా మత్తులోకి మునిగాక బ్లాక్మెయిల్ చేసి అందినంత దోచుకుంటారు.
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్