Tech Tips | ఒకప్పుడు మనిషి నైజం మాటల ద్వారా బయటపడేది. కొన్నాళ్లు సావాసం చేస్తేగానీ ఒకరి వ్యక్తిత్వం ఏమిటో బోధపడేది కాదు! ప్రతి విషయాన్నీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న ఈ సాంకేతిక యుగంలో ప్రొఫైల్పిక్తో మనిషి జాతకాన్ని చెప్పేయొచ్చు. ఇదోరకమైతే, మనం ఇష్టపడి పెట్టుకున్న ప్రొఫైల్పిక్ని పిక్ చేసి మార్ఫింగ్‌తో ఏమార్చి బుక్చేస్తున్న స్కామర్లూ ఉంటారు. సోషల్ మీడియా పద్మవ్యూహంగా పరిణమించవద్దంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి.. అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందే ఉన్నవాటిలో ఉన్నతమైన ప్రొఫైల్ పిక్‌ను ఎంచుకుంటాం. డిస్ప్లే పిక్ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేట్టు ఉండేలా చూసుకుంటాం. మనం చేస్తున్న ఉద్యోగం, ఆసక్తులు, లక్ష్యాలు ఇవన్నీ ప్రొఫైల్‌లో ప్రస్ఫుటించాలని భావిస్తాం. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ ప్రొఫైల్పిక్నే ఆయుధంగా చేసుకొని స్కామర్లు విజృంభించే ప్రమాదం ఉంది. కంటికి అందంగా కనిపించే చిత్తరువుతో ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి మనకు తెలియకుండా మాయలు చేసేవాళ్లూ ఉన్నారు. అందుకే ‘తస్మాత్ జాగ్రత్త’ అంటున్నారు సాంకేతిక నిపుణులు.
☞ ముచ్చటగొలిపే డిస్ప్లే పిక్‌ను ఎంచుకొని, దానిని మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొందరు. ఆ ఇమేజ్‌తో మీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని బెదిరింపులకు దిగుతారు. డబ్బులూ డిమాండ్ చేస్తారు. కోరినంత సొమ్ము ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని భయపెడతారు.
☞ కంపెనీల సీఈవోలు, పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తుల ఫొటోలతో ప్రొఫైల్ పిక్‌గా వాడుకోవడం మరో ఎత్తు. వారి పేరుతో గిఫ్ట్ ఓచర్లు ఇస్తున్నామని బురిడీ కొట్టిస్తుంటారు.
☞ మ్యాట్రిమోనియల్ కుంభకోణాల్లో విభిన్న కోణాలు కనిపిస్తాయి. అందమైన ఫొటోలు, ప్రొఫైల్స్‌తో పెండ్లికోసం ఎదురుచూస్తున్న వధూవరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రెండో పెండ్లి వాళ్లను, వయసు మీదపడుతున్నా వివాహం కాని వ్యక్తులను టార్గెట్ చేస్తారు. వాళ్లను ముగ్గులోకి దించి.. నింపాదిగా డబ్బు కోసం డిమాండ్ చేస్తారు.
☞ ప్రతిష్ఠాత్మకమైన సంస్థలకు చెందిన లోగోలు ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకొని లాటరీ వచ్చిందనీ, స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని నమ్మించి ముంచే ప్రయత్నమూ చేస్తారు.
☞ సామాజిక సేవ పేరుతో కొందరు ఎత్తులు వేస్తారు. శస్త్రచికిత్సకు సాయం కావాలని, అనాథలను ఆదుకోవాలంటూ ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు.
☞ అధిక లాభాల ఆశ చూపించి వాట్సాప్, ఫేస్బుక్, ఇతర మాధ్యమాల ద్వారా ఊదరగొట్టేస్తుంటారు. వాటిని నమ్మితే నట్టేట మునిగే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ మీ ప్రొఫైల్
పిక్‌ను కూడా మార్ఫింగ్ చేసి వాడొచ్చు.

Login
ఫేస్బుక్: ప్రొఫైల్ పిక్చర్ మిస్యూజ్ అయితే, ఎఫ్బీ పేజీలో త్రీ డాట్ (…) మెనూపై క్లిక్ చేయాలి. అందులో ‘ఫైండ్ సపోర్ట్ లేదా రిపోర్ట్ ప్రొఫైల్’ క్లిక్ చేసి, అందులోని సూచనల మేరకు రిపోర్ట్ చేయొచ్చు.
ఇన్స్టాగ్రామ్: ముందుగా ప్రొఫైల్లోకి వెళ్లాలి. త్రీడాట్ మెనూ (…)పై క్లిక్ చేయాలి. రిపోర్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. వాట్సాప్, లింక్డ్ ఇన్, ట్విట్టర్లోనూ ప్రొఫైల్ మెనూలోకి వెళ్లి రిపోర్ట్ చేయొచ్చు. ఎవరికో భయపడిపోయి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. వెంటనే స్పందించండి.
☞ ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా మీ డిస్ప్లే పిక్‌ను ఇతరుల కంటపడకుండా కాపాడుకోవచ్చు. మీరు కోరుకున్న వ్యక్తులు మాత్రమే డీపీ చూసేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.
☞ డిస్ప్లే ఫొటోపై వాటర్‌మార్క్ ఉంచడం ద్వారా కూడా, ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వ్యక్తిగత చిత్రాల మీద కూడా వాటర్‌మార్క్ ఉండేలా జాగ్రత్త పడితే మంచిది. ఫొటో రిజుల్యూషన్ 50 కేబీ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
☞ సున్నితమైన, మతపరమైన అంశాలను సామాజిక మాధ్యమాల్లో వీలైనంత వరకు షేర్ చేయకపోవడం మంచిది. వివాదాస్పద పోస్టుల వల్ల వ్యక్తిగత నిందలకు గురికావాల్సి వస్తుంది. అంతేకాదు, మీ ప్రొఫైల్ ఎవరెవరికో షేర్ అవుతుంది. తద్వారా కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
☞ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ యాక్టివేట్ చేయడం వల్ల మూడోవ్యక్తి.. అనధికారికంగా సమాచారం పొందే వీలు లేకుండా పోతుంది.
☞ ఎవరైనా ఎలాంటి అనుమతి లేకుండా మీ ప్రొఫైల్ పిక్ గానీ, ఇతర విషయాలు గానీ షేర్ చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే కంగారుపడాల్సిన పనిలేదు. సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు రిపోర్ట్ చేయడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?