Fake Parcel Scam | అయినవాళ్లు కూడా అసందర్భంగా అరవెయ్యి విలువచేసే కానుకలు పంపరు! మరి ముక్కూమొహం తెలియని అపరిచితుడు ఫోన్ చేసి ‘హలో.. మీకు ఓ విలువైన బహుమతి పంపుతున్నాం’ అంటే చాలామంది నమ్మేస్తుంటారు. ఫేస్బుక్ దోస్తు అని కొందరు, ఇన్‌స్టా ఫాలోవర్ అని ఇంకొందరు స్కామర్ల బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. తమ చిరునామాకు ఏనాటికీ చేరని బహుమతి కోసం పన్నుల పేరుతో ఆడే నాటకంలో చిక్కుకుంటున్నారు. బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్టు సందేశం రాగానే లబోదిబోమంటున్నారు. వెతికి చూస్తే ‘ఫేక్ పార్సిల్’ స్కామ్ బాధితుల వార్తలు ప్రతిరోజూ పత్రికల్లో ఏదో మూలన కనిపిస్తూనే ఉంటాయి.
‘కొందరిని కొన్నిసార్లే మోసం చేయగలం.. అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేం..’ అని పెద్దలమాట. ఈ మాట ఎవరికైనా చెల్లుతుంది కానీ, స్కామర్లకు వర్తించదు. ఎవరైనా కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. మాటువేసి మాయచేస్తారు. ఫేక్ మెసేజ్‌తో ఎర వేస్తారు. చిక్కకపోతే ఈ-మెయిల్ ద్వారా ఓ రాయి వేస్తారు. స్పందించకపోతే కాల్ చేసి భేదోపాయం ప్రయోగిస్తారు. ఆదమరచి ఉన్నామా ఏదోరకంగా మోసం చేయడం ఖాయం!
ఫేక్ పార్సిల్‌ను అడ్డం పెట్టుకొని రకరకాలుగా మోసగిస్తుంటారు స్కామర్లు. ఉద్యోగులు, సంపన్నులను టార్గెట్ చేస్తారు. ముందుగా ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాలోనో పరిచయం అవుతారు. ఎదుటి వ్యక్తి పురుషుడైతే.. స్కామర్ మహిళగా మైమరిపిస్తుంది. మహిళ అయితే మేల్ ప్రొఫైల్‌తో పరిచయం పెంచుకుంటారు. విదేశాల్లో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తున్నట్టు నమ్మిస్తారు. మాయమాటలతో మనసులు ఇచ్చిపుచ్చుకునే వరకూ తీసుకెళ్తారు. వద్దు వద్దంటున్నా స్విట్జర్లాండ్ నుంచి రూ.10 లక్షల విలువైన రిస్ట్వాచ్నో, మెడలోకి వజ్రాల నెక్లెసో పంపిస్తున్నట్టు చెబుతారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా పంపి ‘అన్నీ మంచి శకునములే..’ అనుకునేలా చేస్తారు. కొద్ది గంటల్లో చెలికాడు పంపే నెక్లెస్ తన మెడలో మెరిసిపోతుందని ఆమె కలల్లో విహరిస్తుంటుంది. ‘ఓ గంట అయితే ప్రియురాలు పంపిన గడియారంతో నా దశ మారిపోతుంది’ అని అతగాడు ఎదురు చూస్తుంటాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ‘మీ పేరిట స్విస్ నుంచి విలువైన వాచ్ వచ్చింది.. కస్టమ్స్ డ్యూటీ కడితే డెలివరీ పంపుతామ’ని చెబుతాడు అవతలి వ్యక్తి. ఇదే తరహా ఫోన్ ఆ అమ్మాయికీ వెళ్తుంది. పంపించింది అయినవారే అనే భ్రమలో డబ్బులు పంపుతారు వీళ్లు. ఈ పంపే ప్రక్రియలో ఖాతా మొత్తం ఖాళీ కూడా కావొచ్చు. లావాదేవీలు సంపూర్ణంగా పూర్తయ్యాక గానీ ఫేక్ పార్సిల్ స్కామ్ అని బోధపడదు.
ఇంకొన్నిసార్లు దండోపాయానికి దిగుతారు స్కామర్లు. తాము టార్గెట్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి పోలీసులమని, కస్టమ్స్ అధికారులమని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతారు. అతని అడ్రస్‌పై మారణాయుధాలు గానీ, డ్రగ్స్ పార్సిల్ గానీ వచ్చిందని బెదిరిస్తారు. ఆ మాటలు నమ్మి తనకేపాపం తెలియదని, వాటికీ, తనకూ ఏ సంబంధం లేదని అన్నారో.. ఏదో సాయం చేసినట్టుగా కలరింగ్ ఇస్తారు. లక్షల్లో బేరాలు మొదలుపెడతారు. మరికొందరు తప్పుడు ప్రచారం చేస్తామని బెదిరించి, డబ్బులు కొల్లగొడతారు. టార్గెట్ చేసిన వ్యక్తి ఇరుగుపొరుగును సంప్రదించి, వారి ద్వారా ఫోన్ చేయించి, ఓటీపీ సేకరించి నిండా ముంచుతారు. ఫేక్ పార్సిల్ ముప్పును తప్పించుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి..
Tech Talk1
☞ గిఫ్ట్ వచ్చిందంటూ వచ్చే సందేశాల్లో వచ్చిన లింక్‌లను క్లిక్ చేయొద్దు. ఈ మెయిల్స్ వచ్చినా, మెసేజ్‌లు వచ్చినా ఎవరు పంపారన్నది చెక్ చేసుకోవాలి.
☞ మీకు సందేశం ఎవరు పంపారో (సోర్స్) తెలియకుండా, అందులోని లింక్‌లను క్లిక్ చేయొద్దు. అటాచ్ చేసిన ఫైల్స్‌లో గానీ, లింక్ సంబంధిత వెబ్సైట్లో గానీ మాల్వేర్ ఉండొచ్చు.
☞ కొరియర్ కంపెనీ ప్రతినిధులు అడ్రస్ చెప్పమంటారు కానీ, మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్ సంగతులు మెయిల్ చేయాల్సిందిగా, మెసేజ్ పంపాల్సిందిగా కోరరు.
☞ ఏదైనా పార్సిల్ మీ పేరిట వచ్చిందని చెప్పగానే, ఎక్కడినుంచి వచ్చిందో స్పష్టంగా తెలుసుకోండి. దానిని మీరు బుక్ చేయనట్లయితే, ఎవరు పంపారో కనుక్కోండి. సదరు కొరియర్ సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి ట్రాకింగ్ నంబర్ ద్వారా నిజానిజాలు నిర్ధారణ చేసుకోవచ్చు.
☞ ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే.. యూపీఐ, క్రెడిట్ కార్డు వంటి సెక్యూర్డ్ పేమెంట్ పద్ధతిని పాటించండి. అంతేకానీ, వైర్ ట్రాన్స్ఫర్, గిఫ్ట్‌కార్డ్స్ ద్వారా చేయొద్దు. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
☞ పేమెంట్ ఆన్ డెలివరీ పద్ధతిని ఎంచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. పని సులభంగా అయిపోతుంది కదా అని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే విధానాన్ని ఎంచు
కోకండి.
☞ పార్సిల్ స్కామ్‌లో చిక్కుకొని ఉంటే వెంటనే సైబర్ క్రైమ్‌కు తెలియచేయండి. టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయండి. https://www.cybercrime.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయని మర్చిపోవద్దు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?