(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : సుంకాల పేరిట యావత్తు ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష చర్యలకు అమెరికా సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ట్రంప్ టారిఫ్‌లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఊపిరిపీల్చుకొన్న పలు దేశాలు.. అప్పటికే ట్రంప్‌తో కుదుర్చుకొన్న వాణిజ్య ఒప్పందంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో అమెరికాతో తాము చేసుకొన్న ట్రేడ్ డీల్‌ను నిలిపేస్తున్నట్టు యూరోపియన్ యూనియన్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు, కోర్టు తీర్పు అనంతరం 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ చేసిన ప్రకటనపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ట్రంప్ వైఖరిని పలు దేశాలు బహిరంగంగానే ఎండగడుతుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ మౌన ముద్రలోనే ఉండటం, భారత రైతుల ప్రయోజనాలను బలి చేసేలా ఉన్న ట్రేడ్ డీల్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. దీంతో కేంద్రం వైఖరిపై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.
సుంకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అమెరికాతో గతంలో చేసుకొన్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు సోమవారం ఈయూ ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం మరో మార్గంలో సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ఈ సందర్భంగా తప్పుబట్టింది. ‘కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ డీల్‌ను నిలిపేస్తున్నాం. కొత్త సుంకాల విషయంలో అమెరికా నుంచి మేం స్పష్టత కోరుతున్నాం’ అని ఈయూ కమిటీ హెడ్ బెర్న్ లాంగ్ అన్నారు. డీల్‌కు సంబంధించిన తదుపరి చర్చలు వచ్చే నెల 4న జరుపనున్నట్టు పేర్కొన్న ఈయూ.. అప్పటివరకూ ఒప్పందం మనుగడలో ఉండబోదని తేల్చి చెప్పింది. కాగా.. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తదుపరి పరిణామాలను అధ్యయనం చేస్తున్నామని, వాణిజ్య ఒప్పందంపై జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని మాత్రమే కేంద్రం ప్రకటించింది. అయితే, డీల్‌ను నిలిపివేస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు. దీంతో.. ఈయూ అమెరికాతో ట్రేడ్ డీల్‌ను నిలిపేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, మోదీ ప్రభుత్వం నుంచి అటువంటి ప్రకటన ఎందుకు రావట్లేదని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన మోదీ.. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారా? అని మండిపడుతున్నారు.
కేంద్రమంత్రి మండలి భేటీలో చర్చించకుండానే ప్రధాని మోదీ అమెరికాతో ట్రేడ్ డీల్‌ను కుదుర్చుకొన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాకు లబ్ధి చేకూర్చడానికి జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మోదీకి ధైర్యం ఉంటే డీల్‌ను రద్దు చేయాలని సవాల్ విసిరారు. యూఎస్ డీల్‌ను రైతుల హృదయాలపై గురిపెట్టిన బాణంగా అభివర్ణించారు.