Disabled People | బోడుప్పల్, జూలై 8: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. బోడుప్పల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటతప్పిందన్నారు.
అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా పట్టింపు లేదా..?
వికలాంగులను మోసం చేయడమే కాకుండా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పెన్షన్ రూ.4 వేల వరకు పెంచుతామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లేరని అన్నారు. స్థానిక సంస్థలు, మరి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తాం :
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆగస్టు 13న వికలాంగుల మహా గర్జన కార్యక్రమాన్ని హైదరాబాదులో లక్షలాది మందితో చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కాళ్ళ జంగయ్య తెలిపారు. అదేవిధంగా రేపటినుండి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో నిరసన తెలుపనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 9న విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాలు జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించి జూలై 10, 11, 12 తేదీల్లో ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జూలై 13 నుండి జూలై 28 వరకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటనలు ఉంటాయని తెలిపారు.
స్పందించకుంటే మహాగర్జనే..
ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని, పట్టించుకోక ఉదాసీనత వైఖరి అవలంబిస్తే.. తాడోపేడో తెలుసుకోవడం కోసం ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో లక్షలాదిమంది వికలాంగులతో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు చిప్పల శ్రీధర్, పాండు యాదవ్, అమర్ , నరసింహ, బిక్షపతి, రాజగోపాల్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!