Municipal Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడ్డ పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనుకుంటున్న అధికార కాంగ్రెస్ బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ను నిలువరించాలని చూస్తున్న సీఎం రేవంత్.. హంగ్ మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న మున్సిపాలిటీలపై కన్నేశారు. ఇప్పటికే బీజేపీలో తనకు అనుకూలంగా ఉన్న పలువురు ముఖ్యనేతల వద్దకు తన దూతలుగా పలువురు మంత్రులను పంపించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పనిచేయాలనే అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.
ఈ మేరకు నిర్దిష్టమైన అవగాహనను ఆదివారం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇలా బీజేపీతో ఒప్పందం చేసుకుంటే, తమకు కనీసం 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ దక్కుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. కానీ, ఇక్కడ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీతో అనైతిక బంధానికి తెరతీశారు. కాంగ్రెస్ పార్టీకి అనేక మున్సిపాలిటీల్లో చైర్మన్, మేయర్ పదవులకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి ఆయా స్థానాలు దక్కకుండా చేసేందుకు ఏకంగా బీజేపీతో ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందానికి తెరతీశారు.
ఇప్పటికే మెదక్ మున్సిపల్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక అవగాహనకు వచ్చి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక్కడ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 15 వార్డులు గెల్చుకున్నది. కాంగ్రెస్ 14 వార్డులే గెలుచుకున్నది. బీజేపీ రెండు వార్డులు కైవసం చేసుకున్నది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ కానున్నారు. నర్సాపూర్‌లో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు స్థానిక కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక వార్డులు గెలుపొందింది. మెట్పల్లిలో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని చెప్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు పంచుకోనున్నాయి. ఇక్కడ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి 11 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 9, బీజేపీకి 5 స్థానాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సహకారంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు సాధించుకోబోతున్నది. రాష్ట్రంలోని మరికొన్ని మున్సిపాలిటీల్లో కూడా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులకు తెరతీసింది.
గతంలో ఎన్నడూలేనివిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలువడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీ ఒకవైపు బీజేపీపై పోరాటం చేస్తుంటే, మరోవైపు రాష్ట్రంలో నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, పదవులు పంచుకోవడం విడ్డూరమని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఒకవైపు ఎంఐఎం, మరోవైపు బీజేపీతో కాంగ్రెస్ జత కట్టడంపై పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో ఎంఐఎంతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పరోక్షంగా సహకరిస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఎంఐఎంతో కాంగ్రెస్ పదవులు పంచుకోబోతున్నది. ఎంఐఎంతో అంటే అవగాహన ఉన్నది, ఫర్వాలేదు కానీ, బీజేపీతో కూడా జతకట్టడం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంకేతం ఇస్తుందనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, ఎంఐఎంపై ఆధారపడి హంగ్ మున్సిపాలిటీలను సాధించుకొనేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు బలప్రయోగం చేసి ప్రత్యర్ధి బీఆర్ఎస్ శిబిరం నుంచి కౌన్సిలర్లను ఎత్తుకొని రావడం, బీజేపీతో అంటకాగడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ శిబిరానికి తూప్రాన్‌లో బీజేపీ బీ ఫారంపై గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లను తరలించినట్టు తెలిసింది. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 9 మంది కౌన్సిలర్ల మద్దతు ఉన్నది. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ నుంచి మరో ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. ఏరకంగా చూసినా ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం ఖాయం. అయితే, ఆదివారం సాయంత్రం బీజేపీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి చొరవ తీసుకొని ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ శిబిరానికి తరలించినట్టు తెలిసింది. సోమవారం జరిగే చైర్మన్ ఎన్నిక సమయానికి ఏదోరకంగా చేసి బీఆర్ఎస్కు చైర్మన్ పదవి రాకుండా అడ్డుకోవాలని, బీజేపీ, కాంగ్రెస్‌కు కలిపి ఉన్న ఏడుగురు సభ్యుల బలంతో ఈ స్థానాన్ని సాధించుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేత, బీజేపీలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కలిసి వ్యూహం రచిస్తున్నట్టు తెలిసింది. తూప్రాన్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే కేసీఆర్ ఇలాకాలో కూడా గెలిచినట్టు చెప్పుకోవచ్చని, అందుకే ఇక్కడ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.