Indian Student : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ (Russia-Ukraine war) పరిస్థితుల నేపథ్యంలో రష్యాలోని ఉఫా నగరం (Ufa city) లో జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయ విద్యార్థి గాయపడ్డాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉఫాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిపై డ్రోన్ దాడి జరిగింది.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. గాయపడిన విద్యార్థితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భద్రతాకారణాల దృష్ట్యా సదరు విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు. కాగా, గత మూడు రోజులుగా రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఈ క్రమంలో మాస్కోకు సుమారు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలక పారిశ్రామిక నగరం ఉఫా లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడి చమురు శుద్ధి కర్మాగారంపై సైతం దాడులు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.