కేసీఆర్ పదేండ్ల పాలనలోనే గిరిజన బిడ్డలకు న్యాయం జరిగింది. ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే నినాదాన్ని కార్యరూపంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కింది. నాడు 3,146 కోయ, గిరిజన, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినం. వేలాది మంది గిరిజన బిడ్డలకు సర్పంచులు, వార్డు సభ్యులుగా అవకాశం కల్పించినం. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చినం.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ): మున్సిపల్ పోలింగ్‌లో అధికార కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడ్డదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల అండతో ప్రతిపక్ష బీఆర్ఎస్పై దౌర్జన్యాలకు దిగిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు హంగ్ ఏర్పడ్డ 34 మున్సిపాలిటీలను దొడ్దిదారిన దక్కించుకొనేందుకు కుట్రలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. బరితెగించి అరాచకపర్వం సాగిస్తున్నదని తూర్పారబట్టారు. ‘ఖాకీల దన్నుతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఎత్తుకెళ్తున్నది.. విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేస్తున్నది.. వారి ఇండ్లకు పోలీసులు, కాంగ్రెస్ గూండాలను పంపి దుర్మార్గాలకు దిగు తున్నది’అని తూర్పారబట్టారు. ఏదేమైనా తాము ఇప్పటికే 15కు పైగా మున్సిపాలిటీలను గెలుచుకున్నామని, హంగ్ ఏర్పడ్డ చాలా చోట్ల గులాబీ జెండాను ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ పొత్తు, తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు.
సింగరేణి పరిరక్షణకు పోరాటం
ఎవరు కలిసొచ్చినా రాకున్నా సింగరేణి పరిరక్షణ పోరాటాన్ని కొనసాగిస్తామని, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతామని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో ముందుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ దోపిడీకి అడ్డుకట్టవేసేందుకే సీపీఐతో పొత్తును ప్రతిపాదించామని స్పష్టంచేశారు. ‘ఇప్పటికే అధికారపార్టీతో సఖ్యత కొనసాగిస్తున్న సీపీఐ కొత్తగూడెం మే యర్ పీఠాన్ని పంచుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు.. ఆ పార్టీ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఎందుకు అంగీకరించిందో తెలియదు.. దాని వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో చెప్పలేను’అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసి సంస్థను పరిరక్షించుకుంటామని పునరుద్ఘాటించారు.
పోడు పట్టాలిచ్చినం..గురుకులాలు కట్టినం
కేసీఆర్ పదేండ్ల పాలనలో గిరిజన బిడ్డలకు న్యాయం జరిగిందని కేటీఆర్ వివరించారు. ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే నినాదాన్ని కార్యరూపంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. నాడు 3,146 కోయ, గిరిజన, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు. వేలాది మంది గిరిజన బిడ్డలకు సర్పంచులు, వార్డు సభ్యులుగా అవకాశం కల్పించామని చెప్పారు. 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రంభీం నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగించామని స్పష్టంచేశారు. గిరిపుత్రులకు అడవు లు, భూములు, నీళ్లపై హక్కులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచామని తెలిపా రు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీలు నెలకొల్పి మెరుగైన విద్యనందించామని వివరించారు. ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచిన ఘనత నాటి కేసీఆర్ సర్కార్కే దక్కిందని చెప్పారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విదేశాల్లో చదువుకొనే గిరిజన విద్యార్థులకు చేయూతనందించామని గుర్తుచేశారు. సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రా మ్ కింద గిరిజన యువతకు వడ్డీలేని, సబ్సిడీ రుణాలు మంజూరు చేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. బంజారాహిల్స్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించామని, జిల్లాల్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరుచేశామని చెప్పారు. సేవాలాల్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి ఆ మహనీయుడికి సముచిత గౌరవమిచ్చామని తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల మేలు కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.
శివుడి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శివుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సేవాలాల్ జయంతి, శివరాత్రి ఒకేరోజూ రావడం ఈ ఆదివారం ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఘనంగా సేవాలాల్ జయంత్యుత్సవాలు
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగ్ బండార్ వే డుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు గిరిజన మహిళలు సంప్రదాయ వేషధారణతో సందడి చేశారు. డప్పుచప్పుళ్ల మధ్య నృత్యా లు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జాన్సన్ రాథోడ్, నాయకులు కరాటే రాజు, రాంబల్ నాయక్, గాంధీనాయక్, రామచంద్రునాయక్, వాల్యానాయక్, పల్లె రవికుమార్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు
బల్దియా ఎన్నికల్లో గెలిచిన మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం ఆయన నివాసంలో కలిశారు. అధికారపార్టీ అరాచకాలకు ఎదురొడ్డి గెలువడం గొప్పవిషయమని కేటీఆర్ ప్రశంసించారు. మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.