బొమ్మలరామారం, జూలై 24: ‘ఎన్నికల్లో ఎన్నో హామీలంటూ కూతలు కూసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులు కన్నీరు కార్చే విధంగా కరెంటు కోతలు విధిస్తూ ఇబ్బందులపాలు చేస్తోంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్, తాగు, సాగు నీరందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి, సోలిపేట గ్రామాల్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పర్యటించారు. మండల కేంద్రంలోని గుడి బావి చౌరస్తా వద్ద హరీశ్‌రావుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హరీశ్‌రావుతో సెల్పీ దిగడానికి పోటీ పడ్డారు. సోలిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలిస్తే మొన్నటిదాక 14, 15 గంటల కరెంటు ఇచ్చినట్లు, ఈ వారం నుంచి కేవలం 12 గంటల కరెంటు అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు గమనించామన్నారు. ఆ 12 గంటల కరెంటు కూడా సక్రమంగా వస్తుందా..? అంటే మధ్యలో అంతరాయం కలుగుతోందన్నారు. కరెంటు సరఫరాకు మేమే పేటెంట్ అని మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటు ఇవ్వడమే మీ పేటెంటా? అని అన్నారు.
‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలాగా రాష్ట్రమంతటా మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఐదేళ్లు తాగునీటిని సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కనీసం ఉన్నదాన్ని నడపడంలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయ్యింది. ఉన్నదాన్ని సక్రమంగా నడిపిస్తే బీఆర్ఎస్కు పేరొస్తుందని, కేసీఆర్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటారని కావాలనే నీళ్లు ఇవ్వడం లేదు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. ‘ఆనాటి రోజులు తెస్తా.. అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకు రావడం, ఎరువుల కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకోవడం, ధాన్యం అమ్ముకోవాలంటే తరుగు తీయడం, కరెంట్ కోసం రైతులు ధర్నాలు చేయడం.. ఇదేనా ఆనాటి రోజులు తేవడం అంటే అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఇండ్లు, సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా అయిలాపూర్, బాల్కొండ, కోహీర్ మండలం దిగ్వాల్, సిద్దిపేట జిల్లా అక్బర్పేట, ఖాజీపూర్, సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ల పరిధిలో మూడు రోజులుగా రాత్రిపూట కరెంటు సరిగా రావడం లేదని రైతులు ధర్నా చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ 23 వేల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ర్టాన్ని అప్పగిస్తే నేడు 15 వేల మెగావాట్ల కరెంటు కూడా అందడంలేదన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారని, 12 గంటల కరెంటు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలనర్సయ్య, మన్నె శ్రీధర్, పెద్దులు, మల్లారెడ్డి, రాంరెడ్డి, వెంకటేశ్, రాజ్‌కుమార్, బాల్సింగ్, సాయి, భాష, నర్సింహ, రమేశ్, సింహారెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు థర్మల్ ప్లాంట్ నడపడం చేతకాదా?
కేసీఆర్ పెట్టిన యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంటులో రెండు యూనిట్లు ఎందుకు మూతపడ్డాయన్నారు. భద్రాది థర్మల్ పవర్ ప్లాంటులో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. సింగరేణి, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటును కట్టి కేసీఆర్ మీ చేతుల్లో పెడితే కాంగ్రెస్‌కు దాన్ని నడపడం చేతకావడంలేదని విమర్శించారు. 1870 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉ త్పత్తి ఎందుకు ఆగిపోయిందన్నారు. రేవంత్‌రెడ్డికి మనసులేక క రెంటు రావడం లేదన్నారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్న మాటలను గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లే రైతులకూ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే బీఆర్ఎస్ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉ త్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ రైతులకు కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందించాలన్నారు. పథకాల్లో కో తలు లేకుండా ప్రజలకు సక్రమంగా అందించాలని డిమాండ్ చే శారు.