హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను 2047 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ వేదికలపై చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతర్గత చర్చల్లో మాత్రం ఆందోళన వ్యక్తంచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు భారీ ఆర్థిక లక్ష్యాలను ప్రకటిస్తూ.. మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లు, వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు నిధులు లేవనడంతో ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు జరిపిన చర్చల సందర్భంగా ఈ వైరుధ్యం తెరపైకి వచ్చింది. ‘365 రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌తోనే సర్కార్ నడుస్తున్నది.
రూ.45 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. స్మాల్ కేక్ మాత్రమే ఉన్నది. అందరికీ తలా కొంత ఎలా పంచాలో మీరే చెప్పండి? చాలా టైట్ సిచ్యుయేషన్తోనే రాష్ట్ర పాలన నడుస్తున్నది’ అని సీఎస్ సంజయ్‌జాజు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగులు భగ్గుమంటున్నారు. డబ్బుల అంశంలో సర్కార్ డబుల్ గేమ్ అడుతున్నదని.. ట్రిలియన్ ఎకానమీ ఇదేనా? అని ఉద్యోగలోకం ప్రశ్నిస్తున్నది. భారీ ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే ముందుగా ప్రస్తుత ఆర్థిక బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు? పెండింగ్ బిల్లులను ఏ కాలవ్యవధిలో క్లియర్ చేస్తారు? ఓవర్‌డ్రాఫ్ట్‌పై ఆధారపడే పరిస్థితిని ఎలా తగ్గిస్తారు? అనే కీలక ప్రశ్నలు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.