ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో జరిగిన అగ్నిప్రమాదంలో శిశువుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని, ఈ మరణాలు ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. బుధవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ బుధవారం రిమ్స్‌లో ప్రమాదం జరిగిన యూనిట్‌ను సందర్శించారు. వీరి వెంట మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మరణించడం బాధాకరమని, తల్లులుగా ఈ ఘటన తమను కలచివేసిందని తెలిపారు. నవజాత శిశువులకు చికిత్స అందించే ఎస్సీఎన్యూలో కనీస సౌకర్యాలు లేవని, ఏసీల నిర్వహణను అధికారులు గాలికి వదిలేసినట్టు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రుల శాపనార్థాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తగులుతాయని అన్నారు. మాజీ మఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో స్వర్ణయుగమని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకొకటి చొప్పున 33 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించినట్టు చెప్పారు. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో పేదలకు వైద్యసేవలు అందడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్‌లో అగ్నిప్రమాదం, ఎంజీఎంలో భవనం పెచ్చులూడటం, నాగర్‌కర్నూల్‌లో రోగులను ఎలుకలు కొరకడం లాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సాయం అందించాలి డిమాండ్ చేశారు. గాయపడిన చిన్నారులకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన తర్వాత జిల్లాలో పర్యటించి వైద్యారోగ్య శాఖ మంత్రి బాధితులకు ఎలాంటి భరోసా కల్పించలేక పోయారని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా రిమ్స్ సౌకర్యాలపై ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శమని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ కమిటీ వేస్తామని మంత్రి చెప్పడం సరికాదని అన్నారు. కాగా మృతి చెందిన ఒక్కో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వారు తెలిపారు.