తిరుమలగిరి జూలై 24: ‘దళిత ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపే నువ్వు ముందు నీ మునుగోడు మురికిని కడుక్కో.. మునుగోడులో అభివృద్ధి జరుగలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిపై రాజగోపాల్‌రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదని ఇటీవల గాంధీభవన్‌లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారని, తోక ఊపితో భయపడబోనని, ముందు ఆయన సొంత నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలని, అసలు మునుగోడు ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంతో ఏం సంబంధమని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీకి ఎందుకు వెళ్లారు? ఆ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో? కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముందు సమాధానం చెప్పాలని, ఆయన బీజేపీలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీని, సోనియాగాంధీని తూలనాడారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకటి లంబాడీ, మరొకటి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించాలని మందుల సామేలు విజ్ఞప్తి చేశారు.‘దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై మీ పెత్తనమేంది’ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలపై వ్యాఖ్యానించే నైతిక హక్కు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర నాయకత్వంతోపాటు ఏఐసీసీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
ఆ మండలాలకు వారే అధ్యక్షులుగా ఉంటారు!
తుంగతుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నియమించిన 9 మండలాల పార్టీ అధ్యక్షులే కొనసాగుతారని మందుల సామేలు స్పష్టంచేశారు. వారి నియామకంపై ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టంచేశారు. దళిత నియోజకవర్గాలపై ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయిందని, తనకు టికెట్ వచ్చిందని చెప్పారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలపై రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకొంటున్న కోమటిరెడ్ది బ్రదర్స్‌పై పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఖర్గేకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనకు ఎవరి ముందు చేతులు చాచే అవసరం లేదని, తుంగతుర్తి ప్రజలకే తాను భయపడుతానని తేల్చి చెప్పారు. నకిరేకల్‌లో వేముల వీరేశానికి 67 వేలు, తుంగతుర్తిలో తనకు 50 వేల మెజారిటీని ప్రజలు ఇచ్చారని గుర్తుచేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
మీ రాజకీయ సమాధికి డప్పు మోగిస్తం
ఎస్సీ నియోజకవర్గాలు అన్నా, దళిత ఎమ్మెల్యేలన్నా అంత అహంకారం ఎందుకు? అని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మందుల సామేలు ఘాటుగా విమర్శించారు. దళిత ఎమ్మెల్యేలు, నేతల జోలికొస్తే దండోరా డప్పులు మోగుతాయని హెచ్చరించారు. ‘మీ రాజకీయ సన్యాసానికి మాదిగలంతా దండోరా డప్పు మోగిస్తారని స్పష్టంచేశారు. తమపై పెత్తనం చెలాయించాలని మీకెవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. తమను హీనంగా చూడటమే కాంగ్రెస్ ప్రజాపాలనా? ఇదేనా కాంగ్రెస్ నీతి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మంత్రి కోమటిరెడ్డికి మెంటల్ కరాబైంది
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మెంటల్ కరాబైంది.. అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి తన నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని, దీనిపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బునాదిగాని కాలువను మంజూరు చేయించానని తెలిపారు.