యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల సామేల్ను ఎమ్మెల్యేగా గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణలు కోరుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తనపై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఎమ్మెల్యే సామేలుపై కోమటిరెడ్డి మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం తన ఇంటికి సామేలు పలుమార్లు వచ్చారని, తాను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా టికెట్ విషయమై ఫోన్లోనే కోరారని చెప్పారు. ఆ సమయంలో టికెట్ ఇప్పిస్తా, అసెంబ్లీకి పంపిస్తా.. అని సామేలుకు ఆనాడే తాను హామీ కూడా ఇచ్చానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇద్దరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించానని, వారిలో తుంగతుర్తిలో మందుల సామేలు ఉన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో భువనగిరి లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు తుంగతుర్తిలో కూడా ప్రచారం చేశానని రాజగోపాల్రెడ్డి చెప్పారు. తన మాట విన్న ఎందరో నాయకులు సామేలు గెలుపుకోసం తుంగతుర్తిలో సొంత డబ్బులు కూడా ఖర్చు చేసుకొన్నారని వివరించారు. అలా టికెట్ ఇప్పించి, గెలిపించిన తనపైనే అక్కసు వెళ్లగక్కుతున్నారంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తుంగతుర్తితో తనకు సంబంధం లేకపోతే సీటు ఇప్పించాలని ఎందుకు తనను ఆయన అడిగారని ప్రశ్నించారు. గెలిచాక తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, ఆయనపై తానెప్పుడూ తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఊరుకోను
‘నిన్నమొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యిర్రి.. కార్యకర్తలను ఎక్కడ ఇబ్బందులు పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం.. గాయారాంలకు భయపడేదిలేదు’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క తుంగతుర్తి, నకిరేకల్ మాత్రమే కాదని, రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల నిజమైన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. తెలంగాణ అంతటా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనలాంటి నేతలపై ఉన్నదని పేర్కొన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యర్తలను కాపాడుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను గౌరవించుకుంటామని, వారికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తల రెక్కలకష్టంతో గెలిచి, వారిపైనే కేసులు పెడుతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. పార్టీ క్యాడర్ను గౌరవించాలని, వారికి న్యాయం చేయాలని, అవమానించొద్దని, ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. పార్టీ శ్రేణులు అందరూ సహనంతో ఉండాలని, ఎవరూ తొందర పడొద్దని, తనపై సామేల్ ఎన్ని వ్యాఖ్యలు చేసినా స్పందించవద్దని హితవు పలికారు. సామేలును గౌరవించాలని, ఆయనకు సహకరించాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టులు, ప్రెస్మీట్లు పెట్టొద్దని కోరారు.