Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముందుకు సాగాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ మోడల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదని.. ఇది అమెరికా సుంకాల ప్రతీకార ఒప్పందంగా పేర్కొంది. అమెరికా వివిధ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసేందుకు జులై 9తో ముగిసిన గడువును ఆగస్టు ఒకటి వరకు గడువును పొడిగించింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం భారత్‌తో సహా ఇతర దేశాలు ఒప్పందం కుదుర్చుకోవడానికి మరో మూడు వారాల సమయం ఉన్నది. ఇప్పటివరకు బ్రిటన్, వియత్నాం మాత్రమే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకున్నది.
చైనాతో కూడా తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ట్రంప్ ఒత్తిడిని పెంచుతున్నది. ఒప్పందం కుదుర్చుకోలేకపోతే ఆగస్టు ఒకటి అమెరికా దిగుమతులకు అడ్డంకులు తొలగించాలంటూ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. అమెరికాలో తయారీని పెంచాలని.. ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే భారీ సుంకాలు తప్పవంటూ 14 దేశాలకు లేఖ రాశారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం నుంచి 40 శాతం వరకు సుంకాలు తప్పవని హెచ్చరించారు. వాణిజ్య డిమాండ్స్‌కు అంగీకరించని దేశాలపై ఆగస్టు ఒకటి నుంచి సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. ట్రంప్ ఆయా ఎదుర్కొనే సుంకాలను వివరిస్తూ 14 దేశాలకు అధికారిక లేఖలపై సంతకం చేసినట్లు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియాపై 25 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జెగోవినాపై 30 శాతం, ఇండోనేషియాపై 32 శాతం, బంగ్లాదేశ్, సెర్బియాపై 35 శాతం, కంబోడియా, థాయిలాండ్‌పై 36 శాతం, లావోస్, మయన్మార్‌పై 40 శాతం సుంకాలను ప్రకటించింది.
అయితే, వైట్‌హౌస్ ‘ఫైనల్ నోటీసు’గా హెచ్చరించిందని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ నిబంధనలపై ఒప్పందంపై సంతకం చేయండి.. లేకపోతే ప్రతీకార సుంకాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తుందని.. దీంతో యూఎస్‌లో వినియోగదారుల ధరలను పెంచే అవకాశం ఉందని, ప్రపంచ సరఫరా గొలుసులలో విస్తృతమైన సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మునుపటి కాలంతో పోలిస్తే మే 2025లో చైనా నుంచి యూఎస్ దిగుమతులు 35 శాతం తగ్గాయి. అయితే, న్యూఢిల్లీ ఒప్పందంపై జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న రాయితీలు, సరకుల రవాణా విషయంలో నెలకొన్న అస్పష్టమైన నిబంధనలు, అన్నింటిపైనా ఒకే రేటుతో కూడిన పన్ను.. తదితర దీర్ఘకాలంలో వాణిజ్య స్థిరత్వానికి ప్రమాదాన్ని గురించి, లోటుపాట్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని జీఆర్‌టీఐ సూచించింది.