హైదరాబాద్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారు. పథకాలపై ఆశ పెట్టుకోవద్దని, సంక్షేమ శకం ముగిసిందని చెప్పారు. ప్రభుత్వం సాయం చేస్తుందని దళిత, గిరిజనులు ఎదురుచూడొద్దని కరాకండిగా తేల్చిచెప్పారు. ఉన్నత చదువులు చదువుకోవాలని, అందుకు ఎంతడిగినా సాయం అందిస్తామని వివరించారు. ఆదివారం ఉదయం బంజారాభవన్‌లో ఏర్పాటుచేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకు గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
‘ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం భూములను తీసుకొని అసైన్మెంట్ పట్టాల రూపంలో పంచారు. ఇప్పుడు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. దళితులకు, గిరిజనులకు నాది ఒక్కటే సూచన. ఆనాడున్న పరిస్థితుల్లో సంక్షేమం, అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నది. కానీ నేడు ఆ శకం ముగిసింది. ఇవ్వాళ భూములు ఇవ్వాలన్నా మా దగ్గర అందుబాటులో లేవు. ఇక భూముల గురించి, ప్రభుత్వమిచ్చే సంక్షేమం గురించి ఆలోచించవద్దు. మేం ఏం చేయం, మాకు భూమివ్వండి? చిన్నవ్యాపారాలు చేసుకుంటామనేది వదిలిపెట్టండి. తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించవద్దు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
అయితే గిరిజన బిడ్డలు ఎంతరవరకు చదువుకుంటారో చదువుకోవాలని, అందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఉచిత సన్నబియ్యం, ఉచిత బస్సు, సబ్సిడీ విద్యుత్ పథకాలు, యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర వాటి గురించి ఏకరువు పెట్టారు. సేవాలాల్ బోధనలు, సామాజిక ఐక్యతకు చేసిన కృషిని కొనియాడారు. తన రాజకీయ ప్రస్థానంలో లంబాడా గిరిజనుల పాత్ర ఎంతో ఉన్నదని, వారి రుణం తీర్చుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ప్రతీ తండాకు బీటీ రోడ్లు, సోలార్ పంప్సెట్లు, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తాగునీరు, విద్యుత్ మౌలిక వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.
రాష్ట్రంలో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు అచ్చంపేట అటవీ ప్రాంతంలో 20 ఎకరాలు సేకరించామని, వచ్చే ఏడాది అకడే వేడుకలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. సేవాలాల్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి రవీందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్,
అదనపు సంచాలకులు సర్వేశ్వరరెడ్డి, గిరిజన సాంసృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు వేమూరి సముజ్వల, చీఫ్ ఇంజినీర్ బాలునాయక్, జీసీసీ జీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన మ్యూజియం క్యురేటర్ ద్యావనపల్లి సత్యనారాయణతో పాటు ఉన్నతాధికారులు, లంబాడా కళాకారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అటకెక్కినట్టేనని మరోసారి తేలిపోయింది.