ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? శాసనసభలో నా? సచివాలయంలోనా? లేక అధికార పార్టీ కార్యాలయంలోనా? అ క్కడెక్కడా కాదు. విశ్వవిద్యాలయా ల ప్రాంగణాలు, తరగతి గదుల్లో ఉంటుంది. కుటుంబం, సమాజం, రాష్ట్రం కోసం మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలుగనే విద్యార్థుల ఆలోచనలో, విద్యార్థుల చైతన్యంలో రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉం టుంది. అటువంటి విద్యార్థులను అవమానించడం అంటే రాష్ట్ర భవిష్యత్తును అవమానించడమే. ప్రభుత్వాలు, నాయకులు మారవచ్చు, కానీ విద్యార్థుల కలలు చెదిరిపోతే ఆ నష్టాన్ని ఏ ప్రభుత్వం కూడా పూడ్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి విద్యార్థులు, యువత గురించి చేసిన పలు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో ఏటా లక్షా పది వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చదువుతున్నారని, వారికి ఉద్యోగ దరఖాస్తు రాయడం కూడా రాదని నోరు పారేసుకున్నారు. వారి చదువు క్రిమినల్ వేస్ట్‌గా మారిందని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది యువత చదువును, బోధించిన ఉపాధ్యాయులను అవమానించేలా మాట్లాడడం దారుణం. విద్యార్థుల ప్రతిభ నిజంగానే ఉద్యోగాలకు సిద్ధంగా లేకపోతే, ఆ పరిస్థితికి బాధ్యులు ఎవరు? పాఠ్య ప్రణాళికలను రూపొందించేది, వర్సిటీలను నియంత్రించేది, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సింది, పరిశ్రమల అవసరాలకు మేరకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సింది ప్రభుత్వం.
విద్యార్థుల నైపుణ్య సాధనలో ప్రభుత్వానికి బాధ్యతే లేదన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ పాఠశాలల విలీనం లేదా మూసివేతకు సంబంధించిన నిర్ణయాలు, విశ్వవిద్యాలయాల భూములపై తలెత్తిన వివాదాలు, ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉన్నత విద్యకు సంబంధించిన పథకాల అమలుపై వచ్చిన విమర్శలను కలిపి చూస్తే విద్యా రంగంపై ప్రభుత్వ నిబధ్ధత ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తున్నది. గత ప్రభుత్వం విదేశీ విద్యా సహాయ పథకం ద్వారా పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం చేసింది. ప్రస్తుతం ఆ పథకం అమలు, చెల్లింపులపై అనిశ్చితి నెలకొన్నది. ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి.
తెలంగాణలో విద్య, విద్యార్థులు, ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అత్యంత కీలకమైన సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నది. మరోవైపు ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ప్రభుత్వానికి భారంగా భావించాల్సిన వ్యయం కాదు. అది సమాజ భవిష్యత్తుపై చేసే అత్యంత విలువైన పెట్టుబడి. విద్యపై ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి ఖర్చు, భవిష్యత్తులో పన్నుల రూపంలోనూ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల రూపంలోనూ, ఆర్థికాభివృద్ధి రూపంలోనూ అనేక రెట్లు తిరిగి వస్తుంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇదే సూత్రాన్ని అనుసరించాయి. అలాంటి పథకాలను అమలు చేయడంలో వైఫల్యాన్ని దాచిపెట్టడానికి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని అనుకోవాల్సి వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విమర్శలు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వడం లేదని, అక్కడ ఇవ్వనప్పుడు తాను ఎలా ఇస్తాననే తరహాలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను మరో రాష్ట్రంతో పోల్చుకుని తప్పించుకోవడం పరిపాలనా ప్రమాణాలను దిగజార్చడమే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుసరించడానికి కాదు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి ఆందోళనలను వినాల్సిన ప్రభుత్వం, వారినే అవమానించే వ్యాఖ్యలు చేయడం తీవ్ర నిరాశ కలిగిస్తున్నది. విద్యార్థులను ప్రత్యర్థులుగా కాదు, భాగస్వాములుగా చూడాలి, వారి ఆవేదనను వినాలి, వారి భవిష్యత్తును నిర్మించే విధానాలు రూపొందించుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో విద్య, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో నేడు విద్యార్థులను అవమానిస్తూ పాలకులు వార్తల్లో నిలువడం నిజంగా రాష్ర్టానికి బాధాకరం. ప్రభుత్వం చేయాల్సింది ఏంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సమయానికి విడుదల చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి. పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇంగ్లిష్, కమ్యూనికేషన్, డిజిటల్ నైపుణ్యాలను ప్రోత్సహించాలి. ప్రజలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే? విద్యార్థులను గౌరవించలేని వ్యక్తికి విద్యామంత్రిగా కొనసాగడానికి నైతిక అర్హత ఉన్నదా? విద్యార్థులు క్రిమినల్ వేస్ట్‌గా కాదు, నేషన్ బిల్డర్స్‌గా చూసే దృక్పథమే తెలంగాణకు అవసరం. కాబట్టి కాంగ్రెస్ సంకుచిత పాలకులు, సంస్కారహీన భాషను కట్టిపెట్టాలి. విద్యను ఖర్చుగా కాదు, భవిష్యత్తుపై పెట్టుబడిగా చూసే విధానమే రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తుంది. జై తెలంగాణ!
(వ్యాసకర్త: న్యాయవాది)
-తన్నీరు శ్రీరంగారావు
98489 33606