న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఏడాదిన్నర లోపలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటమార్చింది. యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయడానికి యోచిస్తున్నదన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, తప్పుదోవ పట్టించేవి అంటూ గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న విషయాన్ని నగదు రహిత చెల్లింపు విధానంపై చార్జీలు విధించడం పట్ల ఆగ్రహంతో ఉన్న పలువురు సోషల్ మీడియా యూజర్లు బుధవారం గుర్తుచేశారు.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేయనున్నారనే ఊహాగానాలు, వాదనలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, తప్పుదారి పట్టించేవి అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2025 జూన్ 11న తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఇటువంటి నిరాధారమైన, సంచలనం సృష్టించే ఊహాగానాలు మన పౌరుల్లో అనవసరమైన అనిశ్చితిని, భయాన్ని, అనుమానాలను రేకెత్తిస్తాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని ఆర్థిక శాఖ ఆ పోస్ట్‌లో స్పష్టం చేసింది.
ఈ విషయమై ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతూ బుధవారం ఆన్లైన్లోనే ఉన్న ఆ ట్వీట్‌ను యూజర్లు పలుమార్లు రీపోస్ట్ చేశారు. ప్రభుత్వం ఏదైనా చెబితే సాధారణంగా దానికి వ్యతిరేకమే నిజమవుతుందనడానికి ఇది మరో రుజువు. దీనికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది అని ఇంటర్నెట్ స్వేచ్ఛా కార్యకర్త నిఖిల్ పహ్వా కామెంట్ చేశారు. కాగా, ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ మాట్లాడుతూ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారని, కమిటీ తదుపరి సమావేశంలో ఈ విషయాన్ని చర్చకు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా కమిటీ సభ్యుడైన ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ పేర్కొన్నారు.