రఘునాథపాలెం, ఆగస్టు 5: రైతుల నెత్తిన ప్రభుత్వం మరో కొత్త యాప్ తెచ్చిపెట్టింది. ఇక నిన్నటివరకు కేవలం యూరియా కోసమే ‘యాప్’ తీసుకొచ్చి ముప్పుతిప్పలు పెట్టిన ప్రభుత్వం.. ఇకపై ఏ ఎరువు కావాలన్నా ‘కొత్త యాప్’లోనే బుక్ చేసుకోవాలంటూ తాజాగా కేంద్ర సర్కార్ మరో యాప్‌ను తీసుకొచ్చి మరిన్ని కష్టాలు పెట్టింది. ‘ఫేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్(ఎఫ్ఎఫ్ఎస్) అనే నూతన యాప్‌ను రూపొందించింది.
ఇప్పటికే యాప్ ద్వారా బుకింగ్‌తో అవసరమైన మేరకు యూరియా లభించక అల్లాడుతున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకొస్తున్న ఈ నూతన యాప్ మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టనున్నాయి. నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు ఇప్పటివరకు యూరియా కోసం చాలా తిప్పలుపడ్డారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో డీఏపీ, కాంప్లెక్స్ తదితర ఎరువులన్నీ బుక్ చేయాల్సి ఉంటుంది. యూరియా, డీఏపీ, పొటాష్, 20-20-0-13, 28-28-0 తదితర కాంప్లెక్స్ ఎరువులన్నీ యాప్‌లో బుక్‌చేసుకొని కొనుగోలు చేసేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, రైతు భరోసా, రాయితీ పథకాలు, ఎరువులు, పంటల బీమా పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకొని ఉండాలి. దీని నంబర్ ఆధారంగా యాప్‌లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ లేకపోతే రైతు ఆధార్‌కార్డుతో లింకై ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఎరువులు బుకింక్ చేసుకోవడం కష్టం.
జిల్లాలో ఇప్పటివరకు 60శాతం రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం సరైనదికాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పాత యాప్ ద్వారా ఎకరానికి గరిష్టంగా రెండు బస్తాలే ఇవ్వగా కొత్త యాప్‌లో ఎన్ని బస్తాలు ఇస్తారో అధికారిక సమాచారం లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి కొత్త యాప్‌తో అందుతాయో లేదోనని భయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని సామాన్య రైతులకు ఈ యాప్ కష్టాలు ఏమిటో అని ప్రశ్నిస్తున్నారు. సాగు అంటేనే భయమేస్తోందని వాపోతున్నారు.