MLA Madhavaram krishna Rao | బాలానగర్, జూన్ 9 : అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా ఉంటే జీహెచ్ఎంసీ కార్యాలయానికి తాళం వేయక తప్పదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. సోమవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో అన్ని విభాగాల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌తో కలిసి ఆయన అస్మత్ పేట బోయిన్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనుల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రెండు సంవత్సరాల క్రితం రూ.17 కోట్ల నిధులు కేటాయించి సుందరీకరణ పనులు చేపడితే ఇప్పటికీ పూర్తి చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెరువులో ఎప్పటికప్పుడు గుర్రపు డెక్క తొలగించే విధంగా చర్యలు చేపట్టే వారమని ప్రస్తుతం అలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయగా.. కట్టపై వాహనాల పార్కింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అని సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని వాహనాలను తొలగించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. డీసెల్టింగ్ వ్యర్థాలను తీసుకువచ్చి చెరువు కట్టపై డంపింగ్ చేయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
రోడ్డుపై వరద నీరు నిలుస్తుందని..
అనంతరం మల్లికార్జున కాలనీలోని కార్పొరేటర్ నరసింహ యాదవ్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి ఆయనతోపాటు అన్ని విభాగాల అధికారులు కాలనీ సంఘాల ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఐఎల్ కాలనీ, ఆర్ఆర్ నగర్, జాగృతి షైన్ టీచర్స్ కాలనీ కోయబస్తీ రాజరాజేశ్వరి టౌన్షిప్ పీవీ ఎన్క్లేవ్ మైత్రివనం కాలనీ పార్క్ విల్లాలకు చెందిన కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా డ్రైనేజీ సమస్యలు, వీధిలైట్లు వెలగడం లేదని, రోడ్లు వేయాలని, రోడ్డుపై వరద నీరు నిలుస్తుందని, ఓపెన్ జిమ్‌కు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తులు చేశారు. కాలనీవాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను సంబంధిత అధికారులకు ఆయన అందజేశారు.
తక్షణమే ఆయా పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు రూ.30 కోట్ల నిధులు కేటాయింపు చేసుకొని అనేక అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నెలకు రూ.65 లక్షలు మాత్రమే కేటాయించడం పట్ల ఏం పనులు చేపడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ టాక్స్ లు కడుతున్నారు. అలాంటప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
తాళం వేసి ఆందోళన చేపడతాం..
జీహెచ్ఎంసీ అధికారులు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోతే కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తాము ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేయవలసి రావడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట భారీగా నిధులు కేటాయించడం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని హితవు పలికారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు పేదల ఇండ్లను కూల్చడంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని విమర్శించారు. జలమండలి, జీహెచ్ఎంసీ, శానిటేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు సమగ్రంగా పనిచేయడం లేదని.. దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అధికారులు ప్రజాగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పనులపై చిత్తశుద్ధి ఉండాలని సూచించారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..