Marri Lakshman Reddy | దుండిగల్, ఏప్రిల్ 7 : చండీగఢ్‌లోని జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 5 పతకాలు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 6,7వ తేదీలలో పంజాబ్‌లోని సెక్టార్ 63 మొహాలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 7వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆయన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.
81 సంవత్సరాల వయస్సులోనూ తనకే మాత్రం తిరుగులేదని మర్రి లక్ష్మణ్ రెడ్డి నిరూపించారన్నారు. 400 మీటర్ల ఫ్రీస్టైల్‌లో బంగారు పతకం, 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో బంగారు పతకం, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో వెండి పతకం ,రిలే ఈవెంట్లలో రెండు కాంస్య పతకలను సాధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా బలంగా, ఆరోగ్యంగా ఉండగలరన్నారు. తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు.
ఎంఎల్ఆర్ విద్యాసంస్థల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ జాతీయ స్థాయి పోటీలలో తన తండ్రి సాధించిన విజయాలు కేవలం వ్యక్తిగత మైలు రాళ్లు మాత్రమే కాదని, యువతరానికి స్పష్టమైన సందేశం అని అన్నారు. చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పతకాలు సాధించడం పట్ల ఎంఎల్ఆర్ ఐటి కళాశాల ప్రిన్సిపాల్ డా కె శ్రీనివాస్ రావు హర్షం వ్యక్తం చేశారు.