హైదరాబాద్: దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రామయ్య సీతమ్మను కల్యాణమాడే అద్భుతఘట్టాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా అనుకున్నారు. ఆదివారం నాటి కల్యాణ వేడుకకు స్వయంగా హాజరుకావాలనుకున్నారు. పవన్ కల్యాణ్ భద్రాద్రి పర్యటనకు వస్తున్నట్లు ఆలయ అధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఉన్నతాధికారులకు కూడా ఏపీ ప్రభుత్వం సమాచారం అందించింది. అయితే ఆయన పర్యతన ఉన్నపళంగా రద్దయింది. కారణం ఏంటంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భద్రాద్రి రామయ్య కల్యాణానికి హాజరయ్యారు. సీతారామచంద్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఇద్దరు నేతలు ఒకేసారి భద్రాచలం వస్తే భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయని తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పవన్ కల్యాణ్ పర్యటనను క్యాన్సల్ చేసుకోవాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ ఆ రాష్ట్ర అధికారులను కోరినట్లు సమాచారం. దీంతో భక్తులకు ఇబ్బందులు కలుగకూడదన్న కారణంతో సానుకూలంగా స్పందించిన ఏపీ ఉపముఖ్యమంత్రి.. తన టూర్‌ను రద్దుచేసుకున్నారు.