R.Krishnaiah | రవీంద్రభారతి, ఏప్రిల్ 6: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హామీ ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైతే సహించేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వం కన్ను వేసి కాంట్రాక్టర్లకు అమ్ముకోవాలని చూస్తుందని ఆరోపించారు. అలాంటి చర్యలు వెంటనే విరమించుకోవాలని లేకుంటే విద్యార్థులతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
యూనివర్సిటీ విద్యార్థుల భూములను అమ్మమని ఎవడిచ్చాడు మీకు అధికారం.. ఈ భూములు ప్రజలది.. విద్యార్థులది అని ఆర్.కృష్ణయ్య అన్నారు. విద్యార్థులకు అవసరమైన భూములను అమ్మితే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూండెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో ఎన్నో జీవరాశులు, అటవీ సంపద, చెరువులు ఉన్నాయని అలాంటి భూమిని కాంట్రాక్టర్లకు అమ్మాలని.. చెట్లను జేసీబీలతో అటవీ సంపదను విధ్వంసం చేయడం ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని, కానీ ప్రభుత్వ భూములు, విద్యాసంస్థల భూముల జోలికి పోలేదని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మి అభివృద్ధి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మే అధికారం ఎవ్వరిచ్చారు.. మీ ప్రతిపాదనను మీ మంత్రులు సైతం వ్యతిరేకిస్తున్నారని, మీ మంత్రులు నాకు ఫోన్ చేసి భూములను పరిరక్షించాలని చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే గొప్ప జీవ వైవిధ్యం కలిగిన క్యాంపస్‌లో ఒకటిగా పేరుగాంచిందని, ఇక్కడ వందల సంఖ్యలో వన్యప్రాణి జాతులు ఉండగా, విశ్వవిద్యాలయ స్థాపన నుంచే హార్టికల్చర్, ల్యాండ్ స్కేప్ విభాగం ద్వారా దీనిని కాపాడుతుందని అన్నారు. ఈ భూమి స్వాధీనం తటస్థంగా జరగపోతే, ఈ జీవ వైవిధ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే 1975లో ఇచ్చిన హామీని గౌరవించి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు భూమిని స్వాధీనం చేసి, పట్టాను జారీచేయాలని సూచించారు.
యూనివర్సిటీ పరిపాలనతో రెవెన్యూ శాఖ కలిసి సమానత్వంతో వ్యవహరించి, భవిష్యత్ తరాలకు విద్య ,పరిశోధన, పర్యావరణ పరిరక్షణకు అందించే చురుకైన చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి, దౌర్జన్యం వెంటనే అరికట్టాలని, యూనివర్సిటీ క్యాంపస్‌లో పోలీస్ పికెటింగ్‌ను ఎత్తివేసి, కేసులు లేకుండా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎవ్వరూ కొనవద్దని, కొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ భూముల అమ్మకం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర విద్యాశాఖ జోక్యం చేసుకొని 400 ఎకరాల భూమిని, పర్యావరణాన్ని, జీవరాశులను పరిరక్షించాలన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం తెలంగాణలోని ఏ యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.