– సీఎంబీని నిర్వహించాలని సీఎండీకి వినతి
– తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి
రుద్రంపూర్, మార్చి 10 : సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా నిర్వహించబడిన మెడికల్ బోర్డు సమావేశాలు ఆ తర్వాత నిలిచిపోయినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసిన ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బోర్డుల ద్వారా హయ్యర్ సెంటర్లకు రిఫర్ చేయబడిన ఉద్యోగుల కోసం జూలై 2025లో ఒక ప్రత్యేక బోర్డు నిర్వహించగా అనంతరం సిక్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగుల కోసం నవంబర్ 2025లో మరోసారి మెడికల్ బోర్డు నిర్వహించినట్లు తెలిపారు. అయితే అప్పటినుండి ఇప్పటి వరకు ఎటువంటి బోర్డు నిర్వహించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ మెడికల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా పునఃసమీక్ష అవసరమని ఉద్యోగి ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తీవ్రమైన గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న కొంతమంది ఉద్యోగులను కూడా విధులకు అర్హులుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని వారు తెలిపారు. ఇటువంటి ఉద్యోగులను విధుల్లో కొనసాగించడం వారి భద్రతకే కాకుండా ఇతర ఉద్యోగుల భద్రతకూ ప్రమాదకరమని సి అండ్ ఎండి కి వెల్లడించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జూలై, నవంబర్ 2025లో నిర్వహించిన మెడికల్ బోర్డుల్లో ‘ఫిట్’గా ప్రకటించబడిన ఉద్యోగులకు మరలా వైద్య పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అదేవిధంగా గతంలో అమలులో ఉన్న విధంగా కార్పొరేట్ మెడికల్ బోర్డును ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించాలని కోరారు. మరణించిన లేదా వైద్యపరంగా అనర్హత పొందిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల ప్రక్రియ అక్టోబర్ 2025 నుండి నిలిచిపోయిందని, కంపెనీ నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియను వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కావున పై సమస్యలను యాజమాన్యం అత్యవసరంగా పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని ఉద్యోగి సంఘాల ప్రతినిధులు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలోముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి ఉన్నారు.