Harish Rao | రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 నుంచి 51 వరకు స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే.. సంక్షేమం అనేది రాజ్యం ప్రాథమిక విధి. నాడు కేసీఆర్ అధికారంలోకి రాగానే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఒకేసారి ఆమోదముద్ర వేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే ‘కల్యాణ లక్ష్మి’ని తెచ్చి అమలు చేశాం. పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం ఇస్తామని మాట ఇచ్చి, చెప్పినట్టే అమలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కల్యాణ లక్ష్మి దరఖాస్తులు ఏకంగా లక్షకు పైగా పెండింగ్లో మూలుగుతున్నాయి. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుడుతున్నా పైసలు రావడం లేదు.. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ‘కల్యాణ లక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారిపోయిందన్నారు.
కొత్త రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుందని నాడు స్వయంగా కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే ట్వీట్ చేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇవ్వకపోగా.. లక్షా 40 వేల రేషన్ కార్డులను దారుణంగా తొలగించి పేదల కడుపు కొట్టారు. సీలింగ్ ఎత్తివేసి ప్రతి ఒక్కరికీ 6 కేజీల బియ్యం ఇచ్చింది, ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సన్న బియ్యం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నది ప్రజలకు తెలుసు.
ఉద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు హరీశ్ రావు. గత మూడు నెలలుగా జీతాల నుంచి EHS డబ్బులు కట్ చేస్తున్నారు కానీ.. ఆ కార్డు పట్టుకుంటే ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న సిద్దిపేట నుంచి రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాజా మొహియుద్దీన్ భార్య అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతే రూ.11 లక్షల బిల్లు వేశారు. EHS వర్తించక, ఆ బిల్లు ఎలాగైనా తగ్గించమని ఆయన నా దగ్గరకు వచ్చి వేడుకున్న పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోయిందని హరీశ్ రావు అన్నారు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండానే జర్నలిస్టులను సైతం EHS లో చేర్చింది. EHS విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో రివ్యూ చేస్తే.. 2023 నవంబర్ నుంచి ఏకంగా 24 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులు రాలేదని స్వయంగా సూపరింటెండెంట్ చెబుతున్నారు.ఇక పోలీసుల పరిస్థితి మరీ దారుణం. వాళ్లకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ బంద్ అయింది, భద్రత లేదు, EHS వర్తించడం లేదు. ఈ పరిస్థితి చూసి పోలీస్ కానిస్టేబుళ్లు వాపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన అంటే కుటుంబ పాలన.. ఫోర్ బ్రదర్స్ పాలన గా మారిపోయింది. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సొంత మనుషులకు మాత్రమే జస్టిస్ జరుగుతోంది..దళితులకు, గిరిజనులకు, బీసీలకు మాత్రం తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
దళితులు, ఎస్టీ, బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సింగిల్ స్కీమ్ అయినా తెచ్చిందా రేవంత్ రెడ్డి..ఈ ప్రభుత్వం చేస్తున్న స్కాములను నేను ఆధారాలతో సహా బయటపెడుతుంటే.. సమాధానం చెప్పలేక నా మీద రేవంత్ రెడ్డి వ్యక్తిగత టార్గెట్ పెట్టుకున్నారు. నాపై తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడు.. 3 నెలలకోసారి ఏదో ఒక అంశంపై నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే.
అసలు రేవంత్ రెడ్డి కథ ఏంటో, ఆయన చరిత్ర ఏంటో గతంలో స్వయంగా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. దేవుడు కనపడితే భక్తితో దండం పెట్టుకోవడం నాకు మొదటి నుంచీ ఉన్న అలవాటు. కానీ, దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం ఒక్క రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య. గుడికి వెళ్తే దేవుడికి దండం పెట్టుకుంటారు కానీ..నేను ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి వెళ్లాను. అలాగే కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి టెంపుల్కు వెళ్లడం కోసం శివమొగ్గ ఎయిర్పోర్టుకు వెళ్లాను. దేవుడి దర్శనం కోసం నేను గుడికి వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా..? అని అడిగారు.
నేను ఎయిర్పోర్టుకు వెళ్లినప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు నన్ను గుర్తుపట్టి నా ఫోటోలు తీసుకున్నారు, నాతో పాటు అభిమానంతో వాళ్లు కూడా ఫోటోలు దిగారు. కానీ నేను అక్కడ ఏవో పూజలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. నేను నిజంగా అలాంటి పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని సవాల్ విసురుతున్నా.
కేవలం నా మీద బురదజల్లి, నా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే కుట్రతోనే ఈ పూజల డ్రామా ఆడుతున్నారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఈ ఆరోపణలు చేయాలి. రేవంత్ రెడ్డి నా పేరు చెబితే.. వెంటనే లీగల్ నోటీసు పంపుదామని నేను రెడీగా ఉన్నాను. కానీ ఆ లీగల్ నోటీసులకు, చట్టానికి భయపడే ఆయన నా పేరు చెప్పకుండా పరోక్షంగా పిరికివాడిలా మాట్లాడుతున్నాడు.
నా మీద 370 కేసులు ఉన్నాయి :
నన్ను అగ్గిపెట్టెతో పోలుస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి.. అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదు. నాడు తెలంగాణ కోసం నిస్వార్థంగా కొట్లాడి నా మీద 370 కేసులు ఉన్నాయి. మెదక్ జైల్లో మూడు రోజులు ఉన్న, రైలు రోకలో 48 గంటలు కంకర రాళ్ల మీదే పడుకున్నా. ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి ఉద్యమం చేశాం. మిలియన్ మార్చ్ సమయంలో నాకు ఈత రాకపోయినా తెలంగాణ కోసం హుస్సేన్ సాగర్ లోకి దూకిన.
మానుకోటలో బుల్లెట్లు పడుతుంటే.. రక్తపు మడుగులో ఉన్నవారిని నా భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి పరుగెత్తిన. ఉద్యమ సమయంలో వందల సార్లు ఢిల్లీ హైకోర్టు చుట్టూ తిరిగిన చరిత్ర నాది.నా పోరాటాన్ని, త్యాగాలను చూసి ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంత మెజార్టీతో ఏకంగా లక్షా 20 వేల ఓట్లతో నన్ను గెలిపించారు. నాపై పోటీ చేసిన ప్రత్యర్థులకు ఏడుసార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర నాది.. నా గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు.