Sreegandham | కుత్బుల్లాపూర్, జూలై 26 : అత్యధిక లాభాలు పొందడానికి ఏకైక మార్గం శ్రీగంధం మొక్కలు పెంచడమే అని జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు, ఆసక్తి ఉన్నవారికి తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించి, సాగు పద్ధతులు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు.
ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాల్లో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగర్బత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు. శ్రీగంధం సాగు చేపట్టే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
శ్రీ గంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు.
ఎకరానికి 250 చెట్లు నాటుకుంటే..
శ్రీగంధం చెట్టు వేడి, గాలిలో తేమ కలిగిన వాతావరణంలో వర్షపాతం కలిగిన ప్రాంతాలలో పెరుగుతుంది. బిందు సేద్యంతో సాగు అనుకూలంగా ఉంటుంది. శ్రీగంధం చెట్టు 30 సంవత్సరాలకు 25 కిలోల వరకు చేవ ఇస్తుంది. ఎకరానికి 250 చెట్లు నాటుకుంటే ఇంచుమించు 6 వేల కిలోలకుపైగా దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శ్రీగంధం నాణ్యతను బట్టి 8 వేల రూపాయల వరకు ధర పలుకుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే పంట కావటం, పెట్టుబడి తక్కువగా ఉండటంతో రైతులు శ్రీగంధం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీగంధం సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది.
రాష్ట్ర అటవీ శాఖ పరిశోధనా విభాగం , ఫారెస్ట్ రిసెర్చ్ సెంటర్ సిద్ధిపేట జిల్లా ములుగు, దూలపల్లి లో అభివృద్ధి చేసిన శ్రీగంధం మొక్కలను అందిస్తుంది. నాణ్యమైన శ్రీగంధం మొక్కలను విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కొక్క మొక్కను రూ.25 చెల్లించి, కావాల్సిన మొక్కలను తీసుకోవాలని కోరుతోంది ఫారెస్ట్ రిసెర్చ్ విభాగం. రైతులు, ఉద్యానవన ఔత్సాహికులు, ఇతర పర్యావరణ ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ అటవీ శాఖ పరిశోధనా విభాగం కోరుతోంది.
వివరాల కోసం..
మరిన్ని వివరాల కోసం స్టేట్ సిల్వి కల్చరిస్ట్, హైదరాబాద్ వారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆసక్తి కలిగిన రైతులు.. క్రింద పేర్కొన్న ఫోన్ నెంబర్లలో 85007-71349,97034-33429,94408-15592 సంప్రదించాలని తెలిపారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన