Govt Schools | శామీర్ పేట్, మే 29 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని మండల విద్యాధికారి కమలాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాబితా గురువారం శామీర్ పేట్ మండలంలోని తూంకుంట, శామీర్ పేట్, తుర్కపల్లి గ్రామాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నిమండల విద్యాధికారి కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించాలన్నారు. ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు.
గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్‌యూటీఎఫ్ శ్రేణులు ఈ రోజు నుండి పది రోజులపాటు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యావ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు.
సగానికిపైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు..
సంపాదనలో సగానికిపైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని హెచ్చరించారు. మన ఊరు – మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మండల విద్యాధికారి కమలాకర్ వెల్లడించారు. ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతీ విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందన్నారు. పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు.
పిల్లలకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుతుంది. తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జై సింహా రెడ్డి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు శ్రీ మాణిక్ రెడ్డి, ప్రచార జాబితాలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ రెడ్డి, జిల్లా కార్యదర్శిలు సత్యనారాయణ, దేవిజా నాయక్, గొడుగు శ్రీనివాస్, కుమార్, మండల అధ్యక్షులు తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానంchildren