హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): థర్డ్ పార్టీ (బెడ్ సైట్ కాంట్రాక్టు) విధానాన్ని రద్దు చేయాలని శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ (ఎస్పీఎస్) మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలను ఐఎఫ్ఎంఐఎస్ విధానంలో అకౌంట్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 60ను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నబొస్క నరేశ్, కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్‌కుమార్, వైనాల రవి, జాయింట్ సెక్రటరీలు గొర్రె నాగరాజు, అంజలి, శ్రావణ్‌కుమార్, నాయకులు ఆనంద్, మురళి, రమేశ్, లక్ష్మణ్, కల్యాణ్, జ్యోతి, రజిత తదితరులు పాల్గొన్నారు.