హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఇంటాబయటా అనేక ఒత్తిళ్లు ఎదురొంటూనే మహిళా సిబ్బంది విధి నిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈతరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు దీటుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో వివిధ హోదాల్లో మహిళా సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు తినిపించారు. కార్యక్రమంలో మునిశేఖర్, వెంకన్న, ఉషాదేవి, శ్రీదేవి, వీ శ్రీదేవి, మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.