హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన పలువురు స్టేట్ సివిల్ సర్వీస్ (ఎస్సీఎస్) అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ హోదా కల్పించింది. వారి సీనియారిటీ, కేటాయింపు సంవత్సరాలను ఖరారు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సెలెక్ట్ లిస్టుల ఆధారంగా ఉద్యోగోన్నతి పొందిన అధికారుల సీనియారిటీని ఐఏఎస్ (సీనియారిటీ క్రమబద్ధీకరణ) రూల్స్-1987 ప్రకారం నిర్ణయించింది. 2022 సెలెక్ట్ లిస్టులో డీ మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జే భవానీ శంకర్, జీ లింగ్యా నాయక్ సహా మొత్తం 11 మంది అధికారులకు కేటాయింపు సంవత్సరంగా 2019ని ఖరారు చేసింది. 2023 సెలెక్ట్ లిస్టులో అబ్దుల్ హమీద్, బీ వెంకటేశ్వర్లు, వైవీ గణేశ్‌కు 2020ని కేటాయింపు సంవత్సరంగా నిర్ణయించింది. 2024 సెలెక్ట్ లిస్టులో ఎన్ ఖీమ్యా నాయక్, కే గంగాధర్‌కు 2021ని అలాట్మెంట్ ఇయర్‌గా కేటాయించింది. సమాచారం నిమిత్తం ఈ ఉత్తర్వుల ప్రతిని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపింది.