హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): దక్షిణ విద్యుత్ నియంత్రణ మండలి 2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదు. శనివారం ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపట్టారు. విద్యుత్ పంపిణీలో సమస్యలపై రైతులు, వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 71,916 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని అంచనావేశారు. గృహజ్యోతి పథకం కారణంగా విద్యుత్ చౌర్యం తగ్గిందని అధికారులు తెలిపారు.
ఫీజుల పెంపు సరికాదు: ఏఐఎస్ఎఫ్
హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మా, ఆర్కిటెక్చర్ కోర్సుల ఫీజుల పెంపు సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. ఫీజుల పెంపుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత, సాంకేతిక విద్యకు దూరమయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.