గద్వాల, జూలై 28 : ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా నడిగడ్డను ఈ వానకాలం సీజన్లో ఎడారిగే మార్చే కుట్ర జరుగుతున్నది. ఈ విషయం తెలిసిన అధికార పార్టీ జిల్లా నాయకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో తలాపున కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. పంటల సాగుకు నీటిని విడుదల చేయడం లేదని రైతులు కన్నీటి సంద్రమవుతున్నారు. రైతులకు ఓ వైపు కరెంట్ కోతలు, మరో వైపు వరద నీటి విడుదల అడ్డంకులు కలుగుతున్నా.. ప్రభుత్వానికి కనికరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరువు తాండవిస్తోన్నది. బయట పడదామంటే ప్రభుత్వ కుట్రల కారణంగా సాధ్యం కావడం లేదు. ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని.. ఆరుతడి పంట లు వేసుకోమని ప్రభుత్వం ప్రచారం చేస్తూనే.. నీరు ఉన్న సమయంలోనైనా సాగుకు నీటిని విడుదల చేస్తే రైతులు పంటలు సాగు చేసుకుంటారంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
విద్యుదుత్పత్తి పేర జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు అధికారులు వదులుతున్నారు. ఆం ధ్రాకు ఎక్కువ నీటిని వదులుతున్నారని స్థానిక రైతులు ఆవేదన చెందుతున్నారు. జలవిద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో నాలుగు మాత్రమే రన్ చేస్తున్నారు. ఇందుకుగానూ 8500 క్యూసెక్కుల నీరు అవసరం కాగా అధికారులు మాత్రం 9,670 క్యూసెక్కుల వదులుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ప్రభుత్వానికి తెలంగాణ రైతుల మీద ప్రేమ కంటే ఆంధ్రా పాలకుల మెప్పు పాకులాడుతోన్నది. దిగువకు నీటిని ఎక్కువగా విడుదల చేస్తూ నడి గడ్డను ఏడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో వచ్చిన నీటితో నడిగడ్డలోని రిజర్వాయర్లు నింపకుండా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరద నీటిని ఒడిసి పట్టడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలకులు, అధికారులది తలోమాట..
మాట్లాడుతుండండతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎల్‌నివో ప్రభావంతో తాగునీటికి మొదటి ప్రాధాన్యత అని చెప్పినా మంచినీటికి సైతం నీటిని విడుదల చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. తాగునీటి విషయంలో జూరాల ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకు వరప్రదాయి ని. దీని ద్వారానే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. అయితే గద్వాల పట్టణానికి తాగునీరు కావాలంటే జములమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. పీజేపీ ప్రధాన కుడి కాల్వకు నీరు విడుదల చేస్తే తప్పా జములమ్మ రిజర్వాయర్‌లోకి నీళ్లు చేరే పరిస్థితి కనిపించడం లేదు. అయితే పాలకులు, అధికారులు మాత్రం కుడి కాల్వకు నీటిని విడుదల చేయకుండా ఈ రిజర్వాయర్‌ను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నది. వరద వచ్చిన సమయంలో మొదటగా నెట్టెంపాడ్ ద్వారా నీటిని ర్యా లంపాడ్, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లకు విడుదల చేసేవా రు.. గద్వాల నియోజకవర్గంలోని గొలుసు కట్టు చెరువులు నింపేవారు. ప్రస్తుతం పరిస్థితి కనిపించడం లేదు.
ఎగువన వర్షాలు కురువడంతో అల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండే దశకు చేరుకున్నాయి. అక్కడి పాలకులు, అధికారులు తమ ప్రాజెక్టులను నింపిన తర్వాత పంటలు సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల అధికారులకు మాత్రం వరద నీటిని ఏ విధంగా వాడుకోవాలో ఇప్పటి వరకు క్లారిటీ లేకుండాపోయింది. 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నా రిజర్వాయర్లను నింపడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వరద సమయంలో డ్యాం కుడి, ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నీటి విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో పోల్చుకుంటే తెలంగాణ సర్కార్ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ర్టాన్ని ఎండపెట్టి, ఆంధ్రాను పచ్చగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది.
నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తే వాటి ద్వారా కాల్వలకు విడుదల చేసే అవకాశం ఉన్నది. దీని ద్వారా గద్వాల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 119 చెరువులకు, గొలుసుకట్టు చెరువుల ద్వారా నీరు అందే అవకాశం ఉన్నది. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావులలో నీరు పుష్కలంగా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పా లకులు, అధికారులు స్పందించి నడిగడ్డలో ఉన్న రిజర్వాయర్లను మొదటగా నింపి, తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు నీటిని విడుదల చేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
గద్వాల, జూలై 28 : ఎగువన వర్షాలు కురువడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 29,768 క్యూసెక్కుల వరద నీరు రాగా ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. తదుపరి జూరాలకు ఇన్‌ఫ్లో తగ్గినా 12 గంటల తర్వాత ఇన్‌ఫ్లో తగ్గి 26000కు చేరుకుంది. మూడు గంటల వరకు ఇన్‌ఫ్లో 20,000 క్యూసెక్కులకు చేరుతుండడంతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళ లాడింది. ఉ మ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయినా జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు హర్షం వెలుబుచ్చుతున్నారు. సాయంత్రం వరకు జూరాలకు 18,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.00 మీటర్ల నీటి నిల్వ ఉన్నది.

జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.611 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నది. విద్యుదుత్పత్తికి 30,000వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతోపాటు నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 1300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు మొత్తం ఇన్‌ఫ్లో సాయత్రం 6:30 గంటల వరకు 18,000 కాగా అవుట్ ఫ్లో 32,727 క్యూసెక్కులుగా నమోదైంది. నారాయణపూర్ డ్యాం నుంచి 84300 క్యూసెక్కుల వరద దిగువకు వస్తున్నది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది.