కోర్టు చీవాట్లు పెట్టినా.. బుల్డోజర్ ఆగలేదు. పిలిచి మందలించినా.. తీరు మారలేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని హెచ్చరిస్తే.. క్షమాపణ చెప్తూనే, తలెగరేస్తారు. కోర్టు ఆదేశాలిచ్చినా.. ఆగడాలు ఆగలేదు. అలా ఒక్కసారి కాదు! ఏకంగా 63సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు హైడ్రా రంగనాథ్!
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : పేరు రంగనాథ్. వ్యవహారం ‘రంగ రంగా..’ అని భజన చేసినట్టే ఉంటుంది. భజన ఎవరికంటే ప్రభుత్వ పెద్దలకో లేదా ఆ పరమాత్ముడు రంగనాథుడికే తెలియాలి. చట్టమంటారు.. ఆ చట్టాన్ని చాప చుట్టినట్టు చుట్టి చంకన పెట్టేస్తారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. కోర్టులంటే లెకలేదు. న్యాయస్థానాలను ధిక్కరించడమే తన స్వరమంటారు. కోర్టు చీ వాట్లు పెట్టిన తరువాత కూడా తప్పు జరిగిందని ఒప్పుకోరు. చివరికి కోర్టు నిప్పులు చెరుగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నట్టు చూస్తారు. న్యా యమూర్తి కోర్టుకు పిలిచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిస్తే క్షమాపణ చెబుతారు. 24గంటలు కూడా తిరుగకముం దే మళ్లీ ధిక్కరణే ఆభరణంగా పాతపాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. మళ్లీ కోర్టు మండిపడితే.. అదే పాత పాట.. అదే క్షమాపణ!
ఏడాదిన్నరగా రంగనాథ్ కేసుల మీద కేసులతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇవన్నీ పరిశీలించిన హైకోర్టు.. ఏకంగా ఆర్మీని రంగంలోకి దించాలనే అసాధారణ నిర్ణయం తీసుకున్నది. అడ్డు వస్తే హైడ్రా యంత్రాంగాన్నే కాదు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను సైతం అదుపులోకి తీసుకోవాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరిగినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. కనీసం ‘క్షమాపణ’ అనే పదం కూడా లేకుండా తొలి అఫిడవిట్ దాఖలు చేస్తే హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ధికరణ కేసుల్లో క్షమాపణ చెప్పడమన్నది చట్ట ప్రకారం అమలు జరుగుతున్న ప్రక్రియ అని గుర్తుచేసిన తర్వాత కూడా క్షమాపణలు చెబుతామని హామీ ఇవ్వలేదు. క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేస్తేనే తదుపరి వి చారణ ఉంటుందని, లేకపోతే ఆర్మీ యాక్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని హైకోర్టు హెచ్చరించిన తర్వాత రంగనాథ్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్.. కోర్టులపై గౌరవం, హుం దాతనం కాపాడేలా లేదని న్యాయస్థానం త ప్పుపట్టింది.
నిజమైన పశ్చాత్తాపంతో, తొలి అవకాశంలో చెప్పిన క్షమాపణకే విలువ ఉం టుందని గుర్తుచేసింది. క్షమాపణలు చెప్పకపోతే, శిక్ష తప్పదని హెచ్చరించాక చెప్పేది అ సలు క్షమాపణే కాదని, ఇలా చెప్పడం పిరికివాడి చర్య అని రంగనాథ్ అసలు రూపాన్ని ఎత్తిచూపింది. పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, ఈ విషయంలో కోర్టు మరోవిధంగా అనుకుంటే ‘క్షమించాలని కోరుతున్నా’ అని అఫిడవిట్లో పేరొనడంలో ఎకడా నిజాయి తీ లేదని ఆక్షేపించింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారిపై కోర్టు ధికరణ చర్యలు తీసుకోవడం ఒకటే మార్గమని తేల్చిచెప్పింది, ఇలాంటి అధికారికి ఉపశమనం కల్పిస్తే.. పాలనపైనే కాకుండా కోర్టుల ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతింటాయని హెచ్చరించింది. గ్రీకు పురాణంలో ’హైడ్రా’ అనే అనేక శిరస్సులతో కూడిన జల సర్పానికి ఒక తల నరికితే రెండు శిరస్సులు పుట్టుకొస్తాయని, అలాంటి హైడ్రా కారాదనే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది.
కూకట్‌పల్లిలోని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్కు చెందిన భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా రాత్రికిరాత్రే కూల్చివేతలు చేపట్టడం, ఆ తర్వాత కం చె వేసి బోర్డు ఏర్పాటు చేసి సమర్థించుకోవ డం హైడ్రాకు అలవాటుగా మారిందని మండిపడింది. పిటిషనర్లు సమర్పించిన ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తే హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టున్నదని పేరొన్నది. సర్వే నంబర్లు 1003-1006 వ రకు ఉన్న 13.17 ఎకరాల భూమిని ఈ నెల 25కు ముందు ఉన్న స్థితికి పునరుద్ధరించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఫెన్సింగ్, సెక్యూరిటీ గదులు, ప్రవేశద్వారాలు కూల్చివేయడంతోపాటు విద్యుత్తు సరఫరా నిలిపేశారన్నది పిటిషనర్ వాదన. దీనిపై ప్రభుత్వం మాత్రం భూమిని తప్పుడు సర్వే నంబర్లతో ఆక్రమించుకున్నారని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. 24 గంటల్లోపు భూమిని యథాస్థితికి తీసుకురావాలని తేల్చిచెప్పింది. హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డులు తొలగించాలని ఆదేశించింది. హైడ్రా ఆదేశాలు అమలు చేయకపోతే పిటిషనరే పను లు చేయించి, ఆ ఖర్చును హైడ్రా నుంచి రాబట్టుకోవాలని ఉత్తర్వుల్లో పేరొన్నది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తలు నెలకొన్నాయి. సాగు భూముల విషయంలో తమకు న్యాయం చేయాలని రైతుల డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కొందరు నిరసనకారులు పోలీసులపై కారం చల్లి, కుర్చీలు కూడా విసిరారు. నేతలు కూడా వారికి మద్దతుగా రావడంతో ఉద్రిక్తత మరిం త పెరిగింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులను రైతులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.
గత ఐదేండ్లలో 9,200 కోర్టు ధికరణ కేసులు హైకోర్టులో దాఖలైతే.. అందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్పైనే 63 కేసులు ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పదేపదే కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడటం రంగనాథ్‌కు పరిపాటిగా మారిందని చెప్పడానికి అనేక కేసులున్నాయి. ఇటీవల కీలక కేసుల్లో హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు సైతం రంగనాథ్‌కు ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించి మరొక అధికారిని నియమించాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల అధికారిక ఆర్డర్ కాపీ కోసం ప్రభుత్వం వేచి ఉన్నది. ఆర్డర్ కాపీ వచ్చాక న్యాయపరంగా విశ్లేషించాక అప్పీల్ చేయాలో, లేదో అనే అంశంపై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మొండివాడు రాజు కంటే బలవంతుడు.. ఈ సామెతను కొందరు న్యాయవర్గాలకు చెందిన వాళ్లు ఉదహరిస్తూ.. మొండి వాడే రాజుగా ఉన్న రాష్ట్ర పాలనలో ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు.
బతుకమ్మకుంట వద్ద కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా నిర్మించిన గేట్, ఫెన్సింగ్, రిటైనింగ్ వాల్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా అవి అమలు కాలేదని కోర్టు ముందు ప్రస్తావనకు వచ్చింది. వాటిని కొనసాగించడమే సముచితమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నివేదిక సమర్పించగా, ఆ నివేదికపై హైకోర్టే విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బతుకమ్మ కుంటలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ హైడ్రా అకడ పలు నిర్మాణాలు చేపట్టిందని బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లో ఫెన్సింగ్, రిటైనింగ్ వాల్, గేట్‌ను తొలగించాలని మార్చి 17న హైకోర్టు ఆదేశించింది. అయితే, ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా రంగనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. గేట్, ఫెన్సింగ్, రిటైనింగ్ వాల్‌ను అలాగే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్న హైడ్రా రంగనాథ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.