త్రిపురారం, జూలై 28 : గ్రామాల్లో పేరుకు పోతున్న సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు సరైన వేదిక లేక సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి మండల పరిషత్ కార్యాలయంలో క్రమం తప్పకుండా మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. కానీ గత రెండేళ్లుగా మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సమావేశాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల గ్రామీణ సమస్యలను ఏ అధికారికి విన్నవించాలో.. ఎలా పరిషరించుకోవాలో తెలియక సర్పంచులు దికుతోచని స్థితిలో పడ్డారు.
ఇండ్లకే పరిమితమవుతున్న మహిళా సర్పంచులు..
త్రిపురారం మండల వ్యాప్తంగా మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 16 మందికి పైగా మహిళా సర్పంచులే ఉన్నారు. సాధారణంగా మండలంలో ఏయే శాఖల అధికారులు ఉంటారు.. వారిని సంప్రదించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపించాలి.. అనే అవగాహన కలగాలంటే సర్వసభ్య సమావేశాలు ఎంతగానో అవసరం. అయితే ఈ సమావేశాలు జరగకపోవడంతో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు బయటకు రాలేక, గ్రామాలకే పరిమితమై పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
ప్రగతి సమీక్ష లేక కుంటుపడిన అభివృద్ధి..
గతంలో ఎంపీపీ అధ్యక్షతన మూడు నెలలకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యేవారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను చర్చించేవారు. ప్రతి శాఖ అధికారి తమ మూడు నెలల ప్రగతి నివేదికను సభలో ప్రవేశపెట్టేవారు. దాంతో సర్పంచులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది. తదుపరి సమావేశం నాటికి సమస్యల పరిషారానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందేది. కానీ ఇప్పుడు సమావేశాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసిందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో జాప్యంతో నష్టం..
గడువు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే స్థానిక సంస్థల పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల జాప్యం తర్వాత గత డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడం అతిపెద్ద లోపం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తే గ్రామాల్లో చిన్న సమస్యలు త్వరితగతిన పరిషారమయ్యేవి. కనీసం మండల స్థాయి అధికారులు చొరవ తీసుకుని సర్పంచులు, వివిధ శాఖల అధికారులతోనైనా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాభివృద్ధికి బాటలు పడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మండల స్థాయి సమావేశాలు చాలా అవసరం..
మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తే అన్ని శాఖల అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. గామంలో ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల కు నేరుగా తెలియజేసి, త్వరగా పరిషరించుకునే వీలుంటుంది. పక గ్రామా ల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో తెలుసుకొని మన గ్రామం లో కూడా అలాంటివి చేపట్టవచ్చు. అధికారులు వెంటనే స్పందించి మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి.
-బైరం లక్ష్మీ కృష్ణ, సర్పంచ్, త్రిపురారం
సమావేశాలు నిర్వహించాలి..
గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో సర్వసభ్య సమావేశాలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ఇప్పుడు పాలకవర్గాలు లేకపోయినా.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల అధికారులకు, సర్పంచులకు మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అధికారులు చొరవ తీసుకొని వెంటనే సమావేశాలు నిర్వహించాలి.
-గుండెబోయిన వెంకటేశ్వర్లు, సర్పంచ్, పెద్దదేవులపల్లి