శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పథకానికి (ఎస్ఎల్బీసీ) రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణాజలాలు అక్కంపల్లి రిజర్వాయర్‌లో వచ్చిపడతాయి. కేసీఆర్ ఈ సుంకిశాల పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదు. ఇది అనవసర ప్రాజెక్టు.. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిన సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో ఐదో మోటారు ఏర్పాటు చేయాలి. దాని ద్వారా కృష్ణాజలాల్ని ఎత్తిపోసి నేరుగా లింక్ కెనాల్లోగానీ జలమండలికి చెందిన కోదండాపూర్ ట్రీట్ప్లాంటుకుగానీ తరలించాలి. సుంకిశాలకు ప్రత్యామ్నాయంగా నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పలు దఫాలుగా రూపొందించిన ప్రతిపాదనలు ఇవి.
Sunkishala | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి కూడా హైదరాబాద్ మహా నగరానికి శాశ్వత ప్రాతిపదికన నీటిని తరలించే సుంకిశాల పథకాన్ని అటకెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలకు ఉదాహరణ మాత్రమే ఇవి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో ముందుచూపుతో ఈ పథకాన్ని చేపట్టి 80 శాతానికి పైగా పనులను సైతం పూర్తి చేయగా, రిటెయినింగ్ వాల్ కుప్పకూలిన తర్వాత ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయాల్ని అన్వేషించింది. కానీ అవేవీ ఆచరణ సాధ్యంకాదని తేలడంతో ఇప్పుడు కేసీఆర్ హయాంలో చేపట్టిన సుంకిశాల పథకాన్నే పూర్తి చేయడం అనివార్యంగా మారింది.
గత ఏడాది పుష్కలమైన వరద వచ్చి సముద్రంలో జలాలు కలిసినప్పటికీ హైదరాబాద్ తాగునీటి కోసం జలమండలి అత్యవసర మోటార్లను ఏర్పాటు చేయాల్సిన విషమ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుంకిశాలను పూర్తి చేసేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంది. గత అనుభవాల దృష్ట్యా సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టుల్లో గేట్లను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక నిపుణులు కన్నయ్య నాయుడిని రంగంలోకి దింపారు. ఈ మేరకు ఎండీ అశోక్‌రెడ్డి రెండు రోజుల కిందట కన్నయ్య నాయుడితో కలిసి సుంకిశాల పథకం పనుల వద్దకు వెళ్లి పరిశీలించారు. నిర్మాణ సంస్థ, ఇంజినీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్‌లోగా పథకాన్ని పూర్తి చేసేందుకుగాను రూట్‌మ్యాప్‌ను రూపొందించుకున్నారు.
హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థలో సుమారు 48 శాతం వరకు కృష్ణాజలాలే ఉంటాయి. ఇంత కీలకమైన జలాలను నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి సేకరిస్తారు. నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా ఎత్తిపోసి… అటు నుంచి జలమండలి కోదండాపూర్ వద్ద నిర్మించిన నీటి శుద్ధి కేంద్రానికి తరలించి శుద్ధి చేసిన తర్వాత నగరానికి పైపులైన్ల ద్వారా తీసుకువస్తారు. అయితే సాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా సాఫీగా జలాల ఎత్తిపోత సాధ్యమవుతుంది. నీటిమట్టం తగ్గేకొద్దీ సరఫరా అంతరాయం కలుగుతుంది.
అందుకే ప్రతి ఏటా వేసవి వచ్చే వరకు జలమండలి అత్యవసర మోటార్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం పరిపాటిగా మారుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రెండు, మూడు సంవత్సరాల పాటు సాగర్‌లో నీటిమట్టం తక్కువైనా డెడ్‌స్టోరేజీ నుంచి నగరానికి కృష్ణాజలాల్ని తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల పథకాన్ని చేపట్టింది. అందులో 80 శాతం వరకు పనులు కూడా పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన పర్యవేక్షణ లేకపోవడంతో గత ఏడాది ఆగస్టులో రిటైనింగ్ వాల్ కూలిన ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఎస్ఎల్బీసీ ద్వారా గ్రావిటీ మీద కృష్ణాజలాలు వస్తాయని, తద్వారా సుంకిశాల అవసరం లేదని భావించింది.
కానీ సొరంగం కుప్పకూలిన సంఘటనతో ఎస్ఎల్బీసీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మాధవరెడ్డి ప్రాజెక్టులో ఐదో మోటారు ద్వారా సుంకిశాల ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచించింది. సుమారు రూ.150-200 కోట్ల వ్యయాన్ని జలమండలి భరిస్తే ఐదో మోటారు ఏర్పాటు చేయవచ్చని నీటిపారుదల శాఖ పలు ప్రతిపాదనల్ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. కానీ జలమండలి అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం.
శాశ్వత పరిష్కారంగా సుంకిశాల పథకమే మేలని భావించి… ఆ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేసీఆర్ పథకమే నగర నీటి సరఫరాకు శ్రీరామరక్షగా మారనున్నది. సుంకిశాల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. రెండు రోజుల కిందట ఇంజినీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడిని తీసుకువెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో గేట్ల అమర్చడంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.
గత ఏడాది తుంగభద్ర డ్యాంలో భారీ వరదలకు గేటు కొట్టుకుపోయిన సందర్భంగా అతి తక్కువ సమయంలో స్టాప్‌లాక్ ఏర్పాటు చేసి నీరు దిగువకు పోకుండా అరికట్టారు. ఈ నేపథ్యంలో సుంకిశాల పథకంలోనూ ఆయన అనుభవం, సేవల్ని వినియోగించుకునేందుకు జలమండలి నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత నిర్మాణ సంస్థతో పాటు జలమండలి ఇంజినీర్లతో ఎండీ, కన్నయ్యనాయుడు సమావేశమై చర్చించారు. దాదాపు నెల రోజులకు పైగా సుంకిశాల పంపుహౌస్‌లో ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించే ప్రక్రియ మరో 20 రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశమున్నట్లు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
సబ్‌స్టేషన్ పనులు దాదాపుగా పూర్తయినందున మిగిలిన ఉన్న మరో నాలుగు కిలోమీటర్ల పైప్‌లైన్ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సాగర్ ఫోర్‌షోర్‌లో మరో గేట్ల వ్యవస్థను ఏర్పాటు చేయడమా? ఉన్న డిజైన్ ప్రకారమే ముందుకుపోవడమా? సత్వరం పనులు పూర్తయ్యేందుకు సాంకేతికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంజినీర్ల కమిటీ మదింపు చేస్తున్నదని ఎండీ పేర్కొన్నారు. ఆ మేరకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసి, ఏప్రిల్‌లోగా సుంకిశాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.