Kandlakoya IT Park | మేడ్చల్, మార్చి18 : కండ్లకోయ ఐటీ పార్క్ నిర్మాణ పనులలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఐటీ రంగాన్ని విస్తరించేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా 2022 సంవత్సరంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేయగా.. ఐటీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి నిధులను మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించిన విషయం విధితమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ఐటీ పార్క్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఉత్తర వైపున మేడ్చల్ జిల్లా కండ్లకోయ జాతీయ రహదారి సమీపంలో అన్ని రకాలుగా సౌకర్యంగా ఉన్న ప్రాంతంలో 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఐటీ పార్క్ ఏర్పాటులో భాగంగా లక్ష చదరపు అడుగులలో ఐటీ కంపెనీలు, మరో లక్ష చదరపు అడగుల స్థలంలో కమర్షియల్‌ను ఏర్పాటు చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
2026 సంవత్సరంలో పూర్తి కావాల్సిన ఐటీ పార్క్ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఐటీ పార్క్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఐటీ పార్క్ నిర్మాణ పనులకు అనుమతి జారీలో హెచ్ఎండీఏ నిర్లక్ష్యం..
ఐటీ పార్క్ నిర్మాణ పనులకు సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతి లభించినా హెచ్ఎండీఏ అనుమతి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నట్లు పేర్కొంటున్నారు. హెచ్ఎండీఏ అనుమతి ఇస్తే పనులు త్వరితగతిన పూర్తి చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి అనుమతి ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.
కండ్లకోయ ఐటీ పార్క్ శంకుస్థాపన సమయంలోనే ఐటీ కంపెనీల ఏర్పాటుకు వంద కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. ఐటీ పార్క్ నిర్మాణం పూర్తయితే సుమారు 2 వందల వరకు ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువుగా ఉండేలా నమూనాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సిద్ధం చేశారు. 2 వందల ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లయితే వేలాది సంఖ్యలో అనేక మంది ఐటీ ఉద్యోగులు ఉండనున్న క్రమంలో మేడ్చల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
అంతేకాక ఈ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ధి చెంది అనేక మందికి ఉపాధి లభించనుంది. ఐటీ పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కైటీయ అధ్యక్షుడు ఒరుగంటి వెంకటేశ్వర్లు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నవించిన్నట్లు పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసుకున్న క్రమంలో త్వరగా ఐటీ పార్క్ నిర్మాణ పనులను పూర్తి చేసేవిధంగా చూడాలని కోరినట్లు ఒరుగంటీ వేంకటేశ్వర్లు తెలిపారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్