హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం శ్రీకృష్ణాలంకారము(మురళీ కృష్ణుడు)లో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ ఉండనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలి వస్తున్నారు.
కాగా, లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 28 వ తేదీ వరకు జరుగనున్నాయి. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 28న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలుకనున్నారు. ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చనలను అధికారు రద్దు చేశారు.