Priyanka Chopra | హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక చోప్రా షేర్ చేసిన పైరేట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుకు హృతిక్ రోషన్ స్పందిస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని కామెంట్ చేయడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. బాలీవుడ్లో ‘క్రిష్’, ‘అగ్నీపథ్’ వంటి హిట్ చిత్రాలతో అలరించిన సూపర్ హిట్ జోడీ మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం గురించి సినీ అభిమానులకు తెలిసిందే. తాజాగా ప్రియాంక నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతుండగా, ఆమె లుక్‌పై హృతిక్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్‌లో ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 21న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక చిత్రంలో బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్, బ్లాక్ హెడ్‌గేర్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆమె.. మరో ఫోటోలో బ్లూ శాటిన్ టాప్, గ్రీన్ స్కర్ట్‌తో సముద్రపు దొంగల తరహా హెడ్‌గేర్ ధరించి ఆకట్టుకున్నారు. ఫోటోలతో పాటు “ప్రెస్ టూర్ రెండో రోజు.. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ పోస్టుకు స్పందించిన హృతిక్ రోషన్, “బ్యూటిఫుల్.. ఈ సినిమా చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో కామెంట్ చేశారు. పైరేట్ లుక్‌లో ప్రియాంక అందానికి ఫిదా అయిన హృతిక్, ఓటీటీ రిలీజ్ కోసం ఆగలేకపోతున్నట్లు తెలిపాడు.
ఇప్పటికే అమెరికా పర్యటనలో హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌తో కలిసి ప్రియాంక, నిక్ జోనస్ దంపతులను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పాత సహనటి సినిమాపై ఆసక్తి చూపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది. ‘ది బ్లఫ్’ చిత్రంలో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో నటించారు. హింసాత్మక గతాన్ని వదిలి కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే మహిళ చేసే యాక్షన్ పోరాటమే కథాంశం. ఈ చిత్రాన్ని రుస్సో బ్రదర్స్ నిర్మించారు. వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల కానుండటం విశేషం.