MLC Shambipur Raju | దుండిగల్, మార్చి17: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు, రసాయన కాలుష్యాన్ని(ఇండస్ట్రియల్ పొల్యూషన్) నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
ఇవాళ శాసనమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లోని బొల్లారం , కాజిపల్లి, జీడిమెట్ల , గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న ఇండస్ట్రియల్ పొల్యూషన్‌తో బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా తెల్లవారుజామున ,రాత్రిపూట పరిశ్రమల నుండి విడుదలవుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు.
ఇక రాంకి వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థలో రసాయన వ్యర్ధాలు భూ భూగర్భంలోకి పంపింగ్ చేస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమై చుట్టూ కిలోమీటర్ దూరంలోని బోర్ బావుల నుంచి రసాయన వ్యర్ధాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై తాను పీసీపీ బోర్డు మెంబర్‌తో మాట్లాడినా ఫలితం లేకుండా పోతుందన్నారు. ఇందుకోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు చేపట్టాలని కోరారు.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల సంగతేంటి..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి హానికారక పరిశ్రమలను నగర శివారు ప్రాంతాల నుండి తరలించాలనే సదుద్దేశ్యంతో.. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుందో తెలియజేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని అప్పట్లో ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చెప్పారని, కానీ సదరు భూములను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు కోర్టులో అఫిడవిట్ వేసిందని తెలిపారు. సదరు భూములను రైతులకు అప్పగిస్తారా…? ఫార్మాసిటీ కోసమే వినియోగిస్తారా..! మరి దేనికోసం ఉపయోగిస్తారు తెలియజేయాలన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు