సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ ) : ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ దాదాపు రూ. 4,800 కోట్ల అప్పులకు రోజు వారి మిత్తి రూ. కోటికి పైగా చెల్లింపులు జరుపుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు జీతభత్యాలు, పెన్షన్లు చెల్లించేందుకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యం నిర్వహణను ప్రైవేట్ పరం చేసి మరింత భారం మోపేందుకు శానిటేషన్ విభాగం రంగం సిద్ధం చేసింది.
పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీ/వీఐపీలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల పారిశుధ్య నిర్వహణను 73 కిలోమీటర్ల మేర రహదారులను అప్పగించారు. 24 గంటలు స్వీపింగ్ జరిగేలా మెక్లిన్, ఇక్సోరా కంపెనీలకు ఈ బాధ్యత అప్పగించారు. ఇందుకుగాను కిలోమీటర్‌కు సగటున నెలకు రూ.3.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవంగా ఇదే పనిని కార్మికుల స్వీపింగ్‌కు నెలకు అయ్యే వ్యయం రూ.40వేలు మాత్రమే. కార్మికులతో పోలిస్తే ప్రైవేట్‌కు చెల్లిస్తున్నది ఎనిమిది రేట్లు అధికం.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేట్ విధానంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తుండగా, తాజాగా అధికారులు సర్కిల్ 12, 13, 14, 17, 18ల్లోని పర్యాటక ప్రాంతాల్లో రూ.14.02 కోట్ల అంచనా వ్యయంతో పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్ నోటిఫికేషన్ ప్రకటనను సిద్ధం చేశారు. సోమవారం స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగే కార్పొరేషన్ మీటింగ్‌లో 31 ఎజెండా అంశంలో ఈ పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్ పరం అంశాన్ని చేర్చారు. ప్రైవేట్ పరం జరిగితే సంస్థపై నెలకు రూ. 2 కోట్ల చొప్పున ఏటా రూ. 24కోట్ల ఆర్థిక భారం పడనుంది. గతంలోనే అప్పగించిన రోడ్లకు ప్రస్తుతం ఏటా రూ. 22.46 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ మొత్తం రూ. 47 కోట్లకు పెరగనుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంస్థకు ఇది ఈ నిర్ణయం మరింత అదనపు భారమే అని చెప్పాలి.
వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు..
27 టూరిస్ట్ ప్రాంతాలు, 73 కిలోమీటర్ల మేరలోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఇక్సోరా కార్పొరేట్ సర్వీస్ ప్రై.లి శానిటేషన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సదరు ఏజెన్సీ గడిచిన కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ బాధ్యతలను చేపడుతున్నది. ప్రత్యేక సిబ్బంది, సూపర్వైజర్లతో కలిసి శానిటేషన్ నిర్వహిస్తున్నారు. మరిన్ని కారిడార్లను ఏజెన్సీలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల తాజా నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మికుల పొట్ట కొట్టే విధానాలను అడ్డుకుంటామంటున్నారు.