వాంకిడి : పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధ్యమని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్త రంజన్ (ASP Chittaranjan) అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం వాంకిడి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్( ZPHS ) పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన ( Exams Awareness ) నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్యసూత్రాలని వెల్లడించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఆ పట్టుదలతో ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాకు ఏఎస్పీగా పని చేస్తున్నానని అన్నారు. దీనంటికి చదువే ప్రధాన కారణమని వివరించారు. చదువు జ్ఞానాన్ని పెంచుతుందన్నారని పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరు గొప్ప లక్ష్య సాధనకై ఆలోచన చేయాలన్నారు. లక్ష్యం సాధించడానికి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. తన మీద తనకు నమ్మకం ఏర్పడ్డప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు. విద్యార్థులు ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆట పాటలతో అలరించారు.
సుమారు 398 మందికి పరీక్ష సామగ్రి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నటరాజ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.