మోర్తాడ్, ఫిబ్రవరి 1: మండలంలోని గాండ్లపేట్‌లో అక్విడెక్ట్ వద్ద వరదకాలువకు ఏర్పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. అక్టోబర్ 9న వరదకాలువకు గండిపడగా, ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత మరమ్మతులు చేపడితే, పనులు మరోమూడునెలలపాటు కొనసాగే అవకాశం ఉన్నది. ఐదునెలల తర్వాత పనులు ప్రారంభించడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరద కాలువ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలతోపాటు జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వరద కాలువకు సంబంధించి మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
రివర్స్‌పంపింగ్ లేకపోతే..
వరదకాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడడం లేదు. ఒకవేళ రివర్స్‌పంపింగ్ లేకపోతే రైతుల పరిస్థితి ఏమిటన్నది ఆలోచిస్తే వరద కాలువపై ఆధారపడినవారి పరిస్థితి దయనీయంగా ఉండేది. జనవరిలో రివర్స్‌పంపింగ్ ద్వారా వరదకాలువకు నీటిని విడుదల చేయడంతో యాసంగి పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం రివర్స్‌పంపింగ్ ద్వారా తిరిగి వరదకాలువకు నీటిని విడుదల చేయాలని ఇటీవల గండిపడిన ప్రాంతంలో పనులను పరిశీలించిన సీఈకి రైతులు విన్నవించారు. దీంతో అధికారులు తిరిగి వరదకాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నందిపంప్హౌస్, గాయత్రీ పంప్‌హౌస్, రాంపూర్ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోశారు.
చివరగా ఎత్తిపోసిన నీరు ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావు పేట్ వరకు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి సోమవారం పంపింగ్ ద్వారా వరదకాలువకు అధికారులు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది. దీంతో సోమవారం సాయంత్రం వరకు నిజామాబాద్ జిల్లాలోని వరదకాలువకు నీరు చేరుకునే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందు చూపుతో నిర్మించారు. అందులో భాగంగానే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా వరదకాలువకు రివర్స్‌పంపింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే కాళేశ్వరం జలాలు, రివర్స్‌పంపింగ్ పునరుజ్జీవ పథకం రైతులకు సాగునీటిని అందించేందుకు ఏవిధంగా ఉపయోగపడుతుందో వరద కాలువకు గండిపడడం ద్వారా తెలుస్తున్నది.
ఐదునెలల తర్వాత పనులు
వరద కాలువకు 2025 అక్టోబర్ 9న గండిపడింది. వెంటనే మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వరద కాలువ, ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయించి పనులను పూర్తిచేయించాలని సూచించారు. వరదకాలువను సందర్శించిన అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించి, నిధులు మంజూరు కాగానే మూడు నెలల్లో పనులు పూర్తి చేయిస్తామని చెప్పడంతో రైతులకు కొంత ఊరట లభించింది. డిసెంబర్ వరకు పనులు పూర్తి కాకపోవడంతో రైతులు ఐక్యరైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వరదకాలువలో రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇరిగేషన్ వరద కాలువ సీఈ సుమతీదేవి, గాయత్రీ పంప్‌హౌస్ సీఈ శ్రీనివాస్‌గుప్తాతో మాట్లాడి వరద కాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేయాలని సూచించారు. దీంతో అధికారులు రివర్స్‌పంపింగ్ ద్వారా నీటిని విడుదల చేయడంతో జనవరి 8న నిజామాబాద్ జిల్లా వరద కాలువకు నీళ్లు చేరుకున్నాయి.