UP Rain : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) వల్ల ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా (Pratapgarh District) లో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహౌలీ వార్డులో ఓ కుటుంబం నివసిస్తున్న పురాతన ఇల్లు భారీ వర్షానికి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ టైమ్‌లో ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. మృతుల్లో ఇంటి యజమాని ప్రమోద్ శ్రీవాస్తవ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (23) తోపాటు వారి ఇద్దరు పిల్లలు మాధవ్ (2), అద్విక్ (4 నెలలు) అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా గత కొన్ని రోజులుగా యూపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లఖ్‌నవూ, మథుర, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. రాబోయే రోజుల్లో పశ్చిమ, తూర్పు యూపీలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పాత భవనాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.