హైదరాబాద్: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషిలా సభలో మాట్లాడారని మండిపడ్డారని చెప్పారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సీఎం రేవంత్‌కు అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలన్నారని, కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి.. మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారన్నారు. వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పదేండ్లు నంబర్ వన్‌గా నిలిపారన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరని విమర్శించారు. గతంలో ఎస్ఆర్ఎస్ ఉచితంగా చేయాలన్న కాంగ్రెస్.. ఇప్పుడు డబ్బులు కట్టాలని పేదలను వేధిస్తున్నదని మండిపడ్డారు. ఫార్మా సిటీ భూముల విషయంలో తాము అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మరో 15 వేల ఎకరాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలన్నారు. ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి.
అసెంబ్లీలో మాట్లాడిన తీరునుబట్టి కాంగ్రెస్ ముసుగువేసుకున్న బీజేపీ వ్యక్తి రేవంత్ అని నిన్న బయటపడిందని చెప్పారు. శనివారం నాటి రేవంత్ ప్రసంగం అంతా మోదీని ప్రసన్నం కోసమేనన్నారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డోడని రేవంత్ అంటారని, అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్‌ను బండకేసి కొట్టారని, 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైందని ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమీ మీ పనితనానికి నిదర్శనమన్నారు.
రుణమాఫీపై కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ రెండు విడుతల్లో కలిపి రూ.28 వేల కోట్లు మాఫీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రూ.18 వేల కోట్లు మాత్రమేనన్నారు. సంపూర్ణ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేదంటూ మీరు ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. మధిరకు పోదామా.., కొడంగల్ పోదామా, సిద్దిపేట పోదామా.. ఏ ఊరుకు పోదామో చెప్పాలన్నారు. ఎప్పటిలోగా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలన్నారు. జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శించారు.