బెంగళూరు: ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు పి అశోక ఆరోపించారు. శివకుమార్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు ఓ ఎస్పీ స్థాయి అధికారి సారథ్యంలో పోలీసు బృందాన్ని సిద్ధరామయ్య ఏర్పాటు చేశారని మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ అశోక ఆరోపించారు.
వివిధ విపక్ష నాయకులపై గతంలో కుమారస్వామి ఏ రకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు(సిట్లు) ఏర్పాటు చేసేవారో అదే విధంగా ఇప్పుడు వారిపైనే ఓ సిట్‌ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన అశోక వ్యాఖ్యానించారు. అయితే ఇది అదృశ్య సిట్‌గా ఆయన అభివర్ణించారు. అధికారికంగా ఎటువంటి ఉత్తర్వు లేకుండా ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఫోన్లో ఎవరు ఏమి మాట్లాడుతున్నారు వంటివి పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు.
ఒక రకంగా ఇది ఫోన్ ట్యాపింగేనని ఆయన ఆరోపించారు. అశోక ఆరోపణలను శాసన మండలిలో విపక్ష నాయకుడు చలవది నారాయణస్వామి కూడా సమర్థించారు. అశోక కర్ణాటకలో బాధ్యత గల విపక్ష నాయకుడని, ఆయన వద్ద ఎంతో కొంత సమాచారం ఉండవచ్చని, దాన్నే ఆయన బయటపెట్టారని నారాయణస్వామి అన్నారు. అశోకపై కొందరు నాయకులు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విపక్ష నాయకుడు అశోక తనపై చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.