ఒంటి రెమ్మకు అతుక్కున్న పండు
గాలి విసురుకు రాలిపడుతుంది
నీటిపై మెరుస్తున్న నీటి బుడగ
క్షణాల్లో చిట్లిపోతుంది
విరగ్గాసిన కాయ మెత్తబడిపోతూ
నల్లబడి నేలపై ఒరిగిపోతుంది
ఏ బంధం ఎన్నాళ్లో
వెలుగునిచ్చే మైనం అంతకంతకూ
కరిగిపోతూ కారిపోతూ చీకటైతుంది
పట్టుకున్న చేతి పట్టు సడలిపోతూ
బలహీనతతో చేయి కలుపుతుంది
కదులుతూ కదులుతూ కీళ్ల పట్టు
అరిగిపోయి నిలిచిపోతుంది
ఏ బంధం ఎన్నాళ్లో
ఆయువుపట్టు ప్రతిక్షణం తరుగుతూ
నింగిలోని శూన్యం కోసం తపిస్తుంది
పెట్టే గుణం ఇరుసు అరిగిన బండిలా
ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది
రక్తబంధం కూడా కట్లు తెంచుకుని
నిశీధిలో పరుగులు పెడుతుంది
ఏ బంధం ఎన్నాళ్లో
అవసరాల కొక్కీకి వేలాడుతూ
తన ఉరిని తానే బిగించుకుంటుంది
నింద మాత్రం మర్రిచెట్టులా పెరుగుతూ
సమాజాన్ని అల్లుకుపోతుంది
కోర్కెలు కట్లపామై కాటు వేస్తూనే
మాయాబంధం విషాన్ని నింపుతుంది
ఏ బంధం ఎన్నాళ్లో
చెట్టును చీడ చుట్టిముట్టి
మట్టిలో కలపాలని ఉవిళ్లూరుతుంది
దేహం తిన్నతిన్నగా కరిగిపోతూ
చీకటి ప్రదేశంలో కలిసిపోతుంది
ఏ బంధమైనా కొన్నాళ్ల ఆరాటమే
ఏ బంధువైనా కొన్నేళ్ల ఆర్భాటమే
ఏ బంధం శాశ్వతమో మరి!
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636